పవన్ కళ్యాణ్ ముమ్మాటికి ప్యాకేజీ స్టారేనని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. బిజెపి రూట్ మ్యాప్ లో టిడిపిని చేర్చాలని చూస్తున్నారని, టిడిపి- జనసేన – బిజెపి కలయిక కొత్తేమీ కాదని విమర్శించారు. అన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ ది ఒంటరి పోటీయేనని, 175 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీకి ఏమంత ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఈ సమావేశాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయపరంగా చూస్తే ఏపీలో జనసేన, బిజెపిలకు ఓట్లు లేవు, సీట్లు లేవని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టులు, ప్యాకేజీలు కాకుండా పవన్ కళ్యాణ్ ఇకనైనా సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలని హితవు పలికారు. విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదని భావిస్తున్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలిసి నడుస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా రూ. 15 వేలకోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు.