ఇసుక, ఇంగ్లీష్ అయిపోయాయి.. ఇక యురేనియం..?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాటాల జోరు పెంచుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయనున్నారు. ఇప్పటికే ఆయన ఇసుక సమస్యపై, ఇంగ్లీష్ మీడియంపై గట్టిగానే మాట్లాడుతున్నారు. మొన్ననే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నా.. 2024 ఎన్నికల దిశగా ఆయన ఇప్పటి నుంచే దృష్టి సారించినట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఆయన ఆంగ్ల మాధ్యమం, ఇసుక సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇసుక విషయంలో టీడీపీ కలసివస్తున్నా .. ఇంగ్లీషు విషయంలో పెద్దగా టీడీపీ పట్టించుకోవడం లేదు. టీడీపీ హయాంలోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ఇందుకు కారణం కావచ్చు. పవన్ మాత్రం ఈ రెండు విషయాలను కేంద్రం వరకూ తీసుకెళ్తానంటున్నారు.

ఇసుక పై పోరాటం ముగిసిన తర్వాత ఆయన యురేనియం అంశంపై దృష్టి సారించబోతున్నారు. ఏకంగా సీఎం జగన్ సొంత నియోజక వర్గం పులివెందులను టార్గెట్ చేయబోతున్నారు. జనసేన పొలిట్‌బ్యూరో సభ్యులు, నేతలు పులివెందుల పర్యటనకు వెళ్తారని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

యురేనియం తవ్వకాలతో అక్కడి ప్రజల జీవితాలు నాశనమైపోతున్నాయంటున్నారు పవన్ కల్యాణ్. పులివెందుల వెళ్లి.. అక్కడి సమస్యను అధ్యయనం చేసి వాళ్లకి ఎలా న్యాయం చేయాలో చూద్దామంటున్నారు. పులివెందుల యాత్ర ద్వారా నేరుగా జగన్ ను టార్గెట్ చేయడం పవన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. వైసీపీ నేతల సంస్కారంపై తాను చేసిన వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ బాధపడిపోతున్నారన్న పవన్.. ముందు మీ నాయకుడికి ఎలా మాట్లాడాలో చెప్పండని సలహా ఇచ్చారు. విడిపోయిన వారి జీవితాలపై మాట్లాడటానికి ఇంగితజ్ఞానం లేదా.. అంటూ పవన్ ప్రశ్నించారు. మరి పవన్ పులివెందుల పోరాటం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news