తెలుగుదేశం పార్టీలో అనిశ్చితి కనబడుతోంది. అంతకు మించి సైలెంట్ రాజకీయం సాగుతోంది. పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు వైసీపీలో చేరుతుండగా… మరికొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండటం శ్రేణులను ఆందోళన కలిగిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇసుక దీక్షకు చాలా మంది ముఖ్యనేతలు.. ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై రకరకాల వాదనలు..విమర్శలు..ఆరోపణలు…గుసగుసలు పార్టీలో మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ పార్టీలో ఈ క్రమణశిక్షణ రహిత ధోరణి కానరాలేదని పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన దేవినేని అవినాష్ చంద్రబాబు ఇసుక దీక్ష రోజే వైసీపీ కండువా కప్పుకుని పార్టీకి షాక్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. వాస్తవానికి అవినాష్ వైసీపీలో చేరిపోతారని ఊహాగానాలు వ్యక్తం కాగా మధ్యలో చంద్రబాబుతో టచ్‌లోకి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆ అనుమానాలు కాస్త స్లో అయ్యాయి.
అయితే అనుహ్యంగా రాత్రికి రాత్రే ఆయన పార్టీ మార్పుపై నిర్ణయం ఖరారు కావడం జరిగిందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మార్పునకే మొగ్గు చూపారు. కొద్ది రోజులుగా జరుగుతున్న సస్పెన్స్‌కు తెరదించి చివరికి వైసీపీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. వీరిద్దరి విషయం పక్కనే గంటా లాంటి సీనియర్ నేత కూడా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వస్తుండటంపై పార్టీ శ్రేణులకు అంతుచిక్కడం లేదు.
అయితే ఆయన పార్టీ మారుతారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయాన్ని ఇప్పటికే కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. ఇసుక దీక్షకు హాజరుకాని ఎమ్మెల్యేలు మరునాడు పార్టీ సమీక్ష సమావేశానికి హాజరవడం గమనార్హం. ఇక వంశీ, గంటా విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ లిస్టులో నెక్ట్స్ ఎవరో ? చూడాలి. అయితే ముఖ్యనేతలు పార్టీ మారిపోతుండటం చంద్రబాబులో కూడా కొంత కలవర పాటుకు గురిచేస్తోందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పార్టీ నేతల తీరుపై లోతైన విశ్లేషణ చేసి తగు చర్యలు తీసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందని శ్రేణులు సూచిస్తున్నాయి.