ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిన పవన్.. ఈ సారి పిఠాపురం నుండి భారీ మెజార్టీతో గెలిసి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి సొంతం చేసుకున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్ల 100 పర్సంట్ విన్నింగ్ స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ తనను కలవడానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు. తనను కలిసి అభినందనలు తెలపడానికి వచ్చే వారు దయచేసి బొకేలు, శాలువాలు తేవొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బులను ఏదైనా మంచి కార్యక్రమం కోసం ఉపయోగించాలని కోరారు. ఇక, ఎన్నికల్లో తమకు ఘన విజయం అందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జిల్లాల వారీగా అందరినీ కలుస్తానని తెలిపారు. ఈ నెల 20 తర్వాత తన సొంతనియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటిస్తానని.. తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని ఆయన స్పష్టం చేశారు.