నేతాజీ అస్థికలను తీసుకురండి..ప్రధాని మోడీకి పవన్‌ కళ్యాణ్‌ రిక్వెస్ట్‌

-

నేతాజీ అస్థికలను తీసుకురావాలని ప్రధాని మోడీకి పవన్‌ కళ్యాణ్‌ రిక్వెస్ట్‌ చేశారు. వలసవాద పాలనా చిహ్నాలను చెరిపేస్తున్న మోడీ అభినందనీయులు అని.. కర్తవ్య పథ్‌ అనేది భారతీయత ఉట్టిపడే నామ ధేయమన్నారు పవన్‌. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే .. ఆ తరవాత రాజ్ పథ్ గా మారి ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించిందని తెలిపారు.

బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 ఏళ్ళు గడిచినా వారి వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా మిగిలిన సజీవ గుర్తులను తుడిచేయడం సంతోషించాల్సిన విషయమని వెల్లడించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంకల్పంతో వలస వాద పాలనలో ఉద్భవించిన పేర్లు మరియు చిహ్నాలను తొలగించాలని ప్రధాని మోడీ ఉద్ఘాటించారన్నారు.

ఆ వాగ్దానాన్ని అమలు చేస్తుండడం హర్షణీయమని..ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే జపాన్ లో భద్రపరచిన నేతాజీ అస్థికలను కూడా రప్పించవలసిందిగా కోరుతున్నానని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమరాలు రాజశ్రీ చౌదరీ బోస్ గారి అనుమతితో ఆమె డి.ఎన్.ఏ.తో వాటిని సరిపోల్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను…ఇది సాకారమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్ధిస్తుందని వెల్లడించారు. భారత జాతి విముక్తి కోసం పోరాడిన ఆ మహనీయునికి నివాళిగా మిగిలిపోతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version