డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం తన పేటీఎం మనీ ప్లాట్‌ఫాంపై త్వరలో స్టాక్ ట్రేడింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పేటీఎం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. పలు ఎంపిక చేసిన వినియోగదారులకు ఇప్పటికే ఈ సౌకర్యాన్ని అందించి పరీక్షిస్తోంది. ఇందులో ఆరంభంలో కేవలం రూ.10తోనే స్టాక్స్ ట్రేడ్ చేసేలా పేటీఎం వినియోగదారులకు సౌకర్యం కల్పించనుంది.
పేటీఎం మనీలో స్టాక్ ట్రేడింగ్‌లో పలు ఫీచర్లను అందివ్వనున్నారు. ఒకేసారి 50 స్టాక్స్‌కు ప్రైస్ అలర్ట్స్ సెట్ చేసుకుని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను పొందవచ్చు. ధర పెరిగినా, తగ్గినా సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఇన్వెస్టర్లు 50 స్టాక్స్‌కు సంబంధించిన సమాచారాన్ని రియల్‌టైంలో తెలుసుకోవచ్చు.
ఇక స్టాక్స్‌ను వీక్లీ, మంత్లీ పద్ధతిలో ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇందులో బిల్టిన్ బ్రోకరేజ్ కాలిక్యులేటర్‌ను అందిస్తున్నారు. దీంతో లాభసాటిగా ఉండే స్టాక్స్‌ను ఎప్పటికప్పుడు అమ్ముకోవచ్చు. ఇక పేటీఎం మనీలో స్టాక్ ట్రేడింగ్ చేసే వారి డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని పేటీఎం తెలియజేసింది. ఆండ్రాయిడ్, వెబ్ ప్లాట్‌ఫాంలపై ముందుగా పేటీఎం స్టాక్ ట్రేడింగ్ అందుబాటులోకి రానుంది. ఆ తరువాత పేటీఎం ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందిస్తారు. దీన్ని అతి త్వరలో అందుబాటులోకి తేనున్నారు.