హత విధీ: పీపీఈ కిట్లు వారికి ఇలా ఉపయోగపడ్డాయి!

-

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారతదేశంలో కూడా తన ప్రభావాన్ని బలంగానే చూపిస్తుంది. ఇక మహారాష్ట్ర, తమిళనాడులతో కలిపి తెలుగు రాష్ట్రాల్లోనూ తన ప్రభావాన్ని చూపిస్తుంది. స్వీయ సంరక్షణే శ్రీరామ రక్ష అని జనాలకే వదిలేసి కేంద్రప్రభుత్వంతో పాటు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ మధ్య ఈ విషయాన్ని లైట్ తీసుకుంటుండగా.. దాన్ని అదనుగా తీసుకుని కరోనా దానిపని అది చేసుకుంటూ పోతుంది.

ఈ క్రమంలో కరోనానుంచి పర్సనల్ ప్రొటెక్షన్ కోసం రూపొందించిన పీపీఈ(పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్)కిట్ల సంగతి అందరికీ తెలిసిందే. వీటిని కరోనా నుంచి రక్షణ పొందడానికి తయారు చేస్తే.. వాటిని పోలీసులు, సీసీ కెమేరాలు గుర్తించకుండా ఉండటానికి వాడుతున్నారు దొంగలు! కరోనా సమయంలో తమ చోరకళకు పీపీఈ కిట్లను ఉపయోగిస్తున్నారు.

తాజాగా మహరాష్ట్రలోని సతారా జిల్లాలోని ఓ జ్యూవెలరీ షాప్ ‌లో తాజాగా ఓ దొంగతనం జరిగింది. ఈ షాపును దోచుకున్న దొంగలు సుమారు 780గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సీసీటీవీ కెమెరాలో ఈ తతంగం మొత్తం రికార్డయింది. అయితే.. ఈ సీసీ టీవీ రికార్డును పరిశీలించిన పోలీసులు షాకయ్యారు. ఎందుకంటే ఆ వీడియోలో దొంగలు పీపీఈ కిట్లు ధరించి ఉన్నారు. చేతులకు గ్లవ్స్, ముఖానికి మాస్కు, బాడీపై ప్లాస్టిక్ కోట్స్, తలపై హెల్మెట్స్ ధరించి పూర్తి సన్నద్ధతతో వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరోనా కిట్లు వారికి అలా ఉపయోగపడ్డాయన్న మాట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయలంటే ఇదేనేమో!!

Read more RELATED
Recommended to you

Exit mobile version