ప్ర‌జాప్ర‌తినిధుల చ‌ట్టంలోని సెక్ష‌న్ 8(3)ను స‌వాల్ చేస్తూ సుప్రీంలో పిటిష‌న్‌

-

పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్ర‌జాప్ర‌తినిధుల చ‌ట్టంలోని సెక్ష‌న్ 8(3)ను స‌వాల్ చేస్తూ పీహెచ్‌డీ స్కాల‌ర్, సామాజిక కార్య‌క‌ర్త ఆబా ముర‌ళీధ‌ర‌న్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆటోమెటిక్‌గా ప్ర‌జాప్ర‌తినిధుల్ని అన‌ర్హులుగా ప్ర‌క‌టించే సెక్ష‌న్ 8 విష‌యంలో దిశానిర్దేశం చేయాల‌ని పిటిష‌న్‌లో కోరారు. ఆ సెక్ష‌న్ అక్ర‌మంగా, ఏక‌ప‌క్షంగా ఉంద‌ని ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య‌ చట్టంలోని సెక్షన్‌ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును పిటిష‌న‌ర్ ప్ర‌శ్నించారు.

ఎంపీలు, ఎమ్మెల్యేల భావ స్వేచ్ఛ‌ను ఆ చ‌ట్టం హ‌రిస్తోంద‌ని పిటిషన్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌మ ఓట్ల‌తో నేత‌ల్ని ఎన్నుకున్నార‌ని, కానీ ఆ చ‌ట్టం వ‌ల్ల ఆ నేత త‌న విధుల్ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌లేక‌పోతున్న‌ట్లు ముర‌ళీధ‌ర‌న్ త‌న పిటిష‌న్‌లో తెలిపారు. అడ్వ‌కేట్ దీపక్ ప్ర‌కాశ్ ద్వారా కోర్టులో ఆ పిటిష‌న్ దాఖ‌లు చేయించారు. అడ్వ‌కేట్ శ్రీరామ్ ప‌రాక‌ట్ కూడా ఆ పిటిష‌న్‌లో కొన్ని అభ్య‌ర్థ‌న‌లు చేశారు. 1951 చ‌ట్టంలోని సెక్ష‌న్ 8, 8ఏ, 9, 9ఏ, 10, 10ఏ, 11కు భిన్నంగా సెక్ష‌న్ 8(3) ఉన్న‌ట్లు పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news