మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఏపీ ప్రజలకు కాసింత ఊరట లభించింది. ఆయా ఇంధన ధరలపై రూ.2 తగ్గిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రేపటి నుంచే ఏపీలో తగ్గిన ఇంధన ధరలు అమలులోకి రానున్నాయి. దీని కారణంగా ఏపీ ప్రభుత్వానికి రూ.1120 కోట్ల ఆదాయం తగ్గుతుంది. ఇక ఇదే విషయంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటని, ప్రజలు అవస్థలు పడుతున్నా, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
గత 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డు అదుపు లేకుండా పెంచుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల సామాన్య ప్రజలకు ఇంధన ధరలు భారంగా మారాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు దీని వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఎక్కువగా ఉన్నందువల్ల పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని, ఇది ప్రజలను పూర్తిగా మభ్య పెట్టేదిగా ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రోజు రోజుకీ పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య ప్రజల జీవనం దుర్భరమవుతుందని, ఇకనైనా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయాలని బాబు తెలిపారు.