పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం గుడ్ న్యూస్ అట‌.. ఇలాంటి వారేనా మ‌న‌కు కావ‌ల్సింది..?

-

రాజ‌కీయ నాయ‌కుల‌కు నిజంగా మైండ్ ఉండి మాట్లాడుతారో, లేదంటే పేద ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లంటే లెక్క‌లేదో తెలియదు కానీ.. ఎప్పుడూ ఏదో ఒక ర‌కంగా ప‌లు అంశాల‌పై పిచ్చి వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంటారు. ఆనక తప్పుగా మాట్లాడామని సారీ చెబుతుంటారు. ఇది వారికి కొత్తే. కానీ వినే జ‌నాల‌కు మాత్రం ఆగ్ర‌హ జ్వాల‌ల‌ను తెప్పిస్తుంది. స‌రిగ్గా ఇలాంటి ఆగ్ర‌హంతోనే ప్ర‌జ‌లు ఇప్పుడు ఊగిపోతున్నారు. అందుకు కార‌ణం ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్య‌లే.

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రోజు రోజుకీ ఏ విధంగా పెరిగిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.86.72 ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ.75.74కు చేరింది. గ‌త 10 రోజుల నుంచి ఇంధ‌న ధ‌ర‌లు పెరిగిపోతున్నాయే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవేవీ ప‌ట్ట‌ని బీజేపీ అధికార ప్ర‌తినిధి న‌ళిన్ కోహ్లి.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం నిజంగా శుభ‌వార్తేన‌న్నారు. వ్యాట్ ద్వారా మ‌రింత ఆదాయం రాష్ట్రాల‌కు వ‌స్తుంది. ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా కేంద్రానికి కూడా ఆదాయం వ‌స్తుంది. అయిన‌ప్ప‌టికీ రాష్ట్రాల‌కే ఎక్కువ ల‌బ్ది చేకూరుతుంది… అని వ్యాఖ్య‌లు చేశారు.

కాగా ఇప్పుడు నళిన్ కోహ్లి చేసిన వ్యాఖ్య‌లు అటు ప్ర‌తి ప‌క్షాల‌తోపాటు ఇటు ప్ర‌జ‌ల‌కు కూడా ఆగ్ర‌హాన్ని తెప్పిస్తున్నాయి. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపుతో జ‌నాలు అల్లాడుతుంటే.. మ‌రో వైపు ఇలా ఏమీ ప‌ట్ట‌న‌ట్లు ఇష్టం వ‌చ్చిన రీతిలో అధికార పార్టీ బీజేపీ నాయకులు వ్యాఖ్య‌లు చేయ‌డం స‌బ‌బు కాద‌ని ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి. చేతనైతే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించండి.. కానీ ఇలాంటి మూర్ఖ‌పు వ్యాఖ్యానాలు చేయ‌వ‌ద్ద‌ని వారు కోరుతున్నారు. అవున్లే.. నేత‌ల‌కు జ‌నాల స‌మ‌స్య‌లు ఎప్పుడు ప‌ట్టాయి క‌నుక‌. వారు అలా మాట్లాడుతూనే ఉంటారు, మ‌నం ఇలా ఆగ్ర‌హం వ్యక్తం చేస్తూనే ఉంటాం. అయినా స‌మ‌స్య తీరుతుంద‌న్న గ్యారెంటీ లేదు. ఏం చేస్తాం.. అంతా మ‌న ఖ‌ర్మ కాక‌పోతే..!

Read more RELATED
Recommended to you

Latest news