త్వరలో ఏపీకి మరో తుపాను ముప్పు వాటిళ్లబోతున్నది. హిందూ మహా సముద్రానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే.. అది తీవ్ర అల్పపీడనంగా మారింది. దానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీంతో దక్షిణ బంగాళాఖాతంలో అది వాయుగుండంగా బలపడనుంది. శనివారం ఉదయం వరకు అది తుపాన్‌గా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపానుకు ఫణి అని పేరు పెట్టారు.
ఫణి తుపాన్.. శ్రీలంక తీరం వెంట వాయువ్య దిశగా కదులుతోందని… 72 గంటల తర్వాత ఈనెల 30న ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రాల మధ్య తీరు దాటే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. దీని ప్రభావం మాత్రం ఆదివారం నుంచే స్టార్ట్ అవనుంది. ఈ తుపాన్ వల్ల ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తీర ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.