డిజిటల్ మార్కెటింగ్ బాగా అందుబాటులోకి వచ్చింది. నగదు లావాదేవీలు అన్ని పూర్తిగా డిజిటలైజేషన్ అయ్యాయి. వ్యాపార వ్యవహారాలు పూర్తిగా ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఫోన్ పే సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. నగదు లావాదేవీలు అన్ని ఫోన్ పే ద్వారా అవుతున్నాయి. ఫోన్ పే యూపీఐ భాగస్వామి అయిన యస్ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు మారటోరియం విధించిన నేపథ్యంలో ఫోన్ పే సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.
ఉదయం నుంచి ఫోన్ పే సేవలు నిలిచిపోవడంతో యూజర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పందిస్తూ తమ బ్యాంకింగ్ భాగస్వామి యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో తమ సేవలు ప్రభావితం అయ్యాయని ఆయన వివరించారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని సమీర్ హామీ ఇచ్చారు.
పేమెంట్స్ ప్లాట్‌ఫాం ఫోన్ పే సేవలు మరికొన్ని గంటల్లో అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలోనే యూజర్లకు సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని ఫోన్ పే ఫౌండర్ అండ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) రాహుల్ చారి కూడా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. యూపీఐ ఆధారిత పేమెంట్ల సేవలు మాత్రం తమ నూతన భాగస్వామితో కలిసి ఈ రోజు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. మరికొన్ని గంటల్లో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వాలెట్ సర్వీసులు కూడా తిరిగి అందుబాటులోకి వస్తాయని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు.