ఫోన్ పేరు చెబితే కంగారు పడుతున్న గుంటూరు పోలీసులు…!

ఫోన్ పేరు చెబితేనే గుంటూరు ఖాకీలకు కంగారు పుట్టుకొస్తుంది..అసలే అధికార పక్షం..ఆ పైన ఫోన్ సంభాషణల వ్యవహరం…ఎమ్మెల్యేలు,ఎంపీలు ఉన్న వ్యవహరంలో పోలీసుల దర్యాప్తు అంశం కీలకంగా మారింది. అదికార పార్టికి చెందిన నేతల మద్య వ్యవహరం కావటంతో ఎలా డీల్ చేయాలనే అంశం పై ఖాకీలు మల్లగుల్లాలు పడుతున్నారు.

గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫోన్ సంభాషణల మార్ఫింగ్ ,ట్యాంపింగ్ ల వ్యవహరం దుమారం రేపుతున్నాయి. రాజకీయంగా మొదలయిన ఈ అంశాలు ఇప్పుడు ఖాకీల వద్దకు చేరాయి. దీంతో ఎక్కడ ఎలా వ్యవహరించాలి,కేసును ఎలా డీల్ చేయాలనే అంశం పై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఇప్పటికే చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజనీ ఫోన్ ట్యాపింగ్ అంశం అత్యంత కీలకంగా మారింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తో పాటుగా మరో ఎమ్మెల్సీ కలసి విడుదల రజనీ ఫోన్ ను ట్యాపింగ్ చేశారనే ప్రచారం జరిగింది. దీన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా కొట్టి పారేశారు. అయితే ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ తో పాటుగా సీఐ పై పోలీసు ఉన్నతాదికారులు సస్పెన్షన్ వేటు వేయటం సంచలనంగా మారింది. పోలీసుల పై చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది కాబట్టి సస్పెస్షన్ ను ఎత్తివేయాలని రాజకీయ నాయకులు తీవ్ర స్దాయిలో ఒత్తిడి తేవటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ వ్యవహరం జరుగుతుండగానే ఇటు రాజదాని ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి మాట్లాడినట్లుగా చెబుతున్న ఫోన్ సంభాషలు కూడ వెలుగులోకి రావటం మరో దుమారం రేపింది. రెండు వ్యవహరాల్లో అధికార పార్టీకి చెందిన శాసన సభ్యులు, ఎంపీలు ఉన్నారు. దీంతో ఈ రెండు కేసులు పోలీసులకు సవాల్ గా మారాయి..

ఇప్పటికే చిలకలూరిపేట ఎపిసోడ్ లో ఫోన్ ట్యాపింగ్ అంశంలో తీవ్ర వత్తిళ్లు ఎదుర్కొంటున్న పోలీసులకు తాజాగా తాడికొండ ఎపిసోడ్ లో బయటకు వచ్చిన ఆడియో టేపులు అంశమే కీలకంగా మారింది. అధికార పక్షం నుంచే వరుసగా ఫోన్ సంబాషణలకు సంబందించిన వ్యవహరాలు కేసుల రూపంలో ముందుకు రావటంతో పోలీసులు కూడా ఈ అంశాలపై తర్జనబర్జన పడుతున్నారు. ఈ రెండు వ్యవహరాల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి అనే అంశాల పై ఆసక్తి నెలకొంది.