రూ.40 కోట్ల ఆఫర్‌ రిజెక్ట్ చేసి యూట్యూబ్ ఛానెల్‌ని నమ్ముకున్నాడు.. చివరకు..?

-

మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ అయినా చిన్నతనంలోనే ఇండిపెండెంట్‌గా బతకాలనుకున్నాడు. తన ఫ్యామిలీకి తానే చేదోడు వాదోడుగా నిలవాలనుకున్నాడు. అలా తొమ్మిదో తరగతిలో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టి.. కార్పొరేట్ కళాశాలలు లక్షలు ఆఫర్‌ చేసే ఉద్యోగాన్ని సంపాదించాడు. అయినా ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేని ఆ యువకుడు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. ఆరేళ్లయినా అర్ధరూపాయి రాని ఛానెల్‌పై ఫుల్‌టైమ్ ఫోకస్ పెట్టి దాన్ని యాప్‌గా మార్చాడు. వేల మంది విద్యార్థులకు ఈజీ టీచింగ్ మెథడ్స్‌తో బోధిస్తూ ఇప్పుడు కోట్ల టర్నోవర్ సంపాదిస్తున్నాడు. అతడే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన అలఖ్‌ పాండే. మరి అతడి జీవనగమనం ఏంటో తెలుసుకుందామా..?

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన అలఖ్‌ పాండేది మధ్యతరగతి కుటుంబమే. తన ఆర్థిక స్థితి మిడిల్ క్లాస్ కానీ తన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ హైక్లాస్‌గానే ఉండేవి. ఇండిపెండెంట్‌గా ఉండటమే కాదు.. కుటుంబానికి చేయూతనివ్వాలన్న ఆలోచన అలఖ్‌కి తొమ్మిదో తరగతిలో ఉండగానే వచ్చింది. అప్పటి నుంచే తన కంటే చిన్నవాళ్లకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. ట్యూషన్‌తో వచ్చిన డబ్బు కుటుంబం గడవానికే సరిపోయేది. అందుకే తాను అనుకున్నట్లు ఐఐటీలో సాధించాలనుకున్న లక్ష్యం కలగానే మిగిలిపోయింది.

ట్యూషన్లు చెప్పడంతో దిట్టగా మారిన అలఖ్ పాండే గురించి కార్పొరేట్ యజమాన్యాలకు తెలిసింది. లక్షల జీతం ఇస్తామంటూ తమ కళాశాలలో చేర్చుకున్నాయి. అయితే ఒకరి కింద పనిచేసే అలవాటు లేని అలఖ్ వీలైనంత త్వరగా ఆ ఉద్యోగం మానేయాలనుకున్నాడు. కానీ తన కుటుంబ పరిస్థితి సహకరించదు. అందుకే ఓ వైపు కాలేజీలో పనిచేస్తూనే.. స్నేహితుడి సలహాతో ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. ఫిజిక్స్ వాలా పేరుతో 2014లో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాడు. ఆరంభంలోనే 10వేల మంది చందాదారులు. అయితే ప్రైవేటు కాలేజీలో పాఠాలు బోధించడం మానలేదు. ఏళ్లు గడుస్తున్నా యూట్యూబ్‌ ఛానల్‌కి ఆశించినంత స్పందన రాలేదు.

2016లో డేటా విప్లవం వచ్చాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. 2017లో కాలేజీలో బోధించడం మానేసి మొత్తం యూట్యూబ్‌పైనే ఫోకస్ చేశాడు. ఫిజిక్స్‌వాలా పేరుతో నీట్‌, జేఈఈ విద్యార్థులకు యూట్యూబ్‌లో కోచింగ్‌ షురూ చేశాడు. రెండేళ్లు కష్టపడితే కానీ 2019లో యూట్యూబ్‌ ద్వారా ఆదాయం ఆశించినంతగా రాలేదు.

అలఖ్ యూట్యూబ్ పాఠాలు చూసిన ఎడ్‌టెక్ కంపెనీ అతడికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. నెలకు రూ. 3.30 కోట్ల వంతున ఏడాదికి రూ.40 కోట్ల వార్షిక వేతనం అందిస్తామంటూ ఆహ్వానం పలికింది. కానీ మనోడికి ఒకరి కింద పనిచేసే అలవాటు ఏనాడూ లేదు. అందుకే ఈ ఆఫర్‌ని కూడా తిరస్కరించాడు. అలఖ్ ఆఫర్‌ను తిరస్కరించడం గురించి తెలుసుకున్నవారంతా అతణ్ని ఓ పిచ్చోడిలా చూశారు. కానీ తన లైఫ్‌పై అలఖ్‌కు ఓ క్లారిటీ ఉందన్న విషయం వాళ్లకెవరికీ తెలియదు.

ఇంతలోనే కరోనా మహమ్మారి వచ్చింది. లాక్‌డౌన్ తెచ్చింది. నక్కతోక తొక్కినట్లు అలఖ్‌కు కరోనా కలిసొచ్చింది. ఆన్‌లైన్‌ క్లాసులే విద్యార్థులకు దిక్కైన సమయంలో ఆ అవకాశాన్ని అలఖ్‌ అందిపుచ్చుకున్నాడు. 2020 జూన్‌లో ఫిజిక్స్‌వాలా పేరుతో యాప్‌ రిలీజ్‌ చేసి ఎడ్‌టెక్‌ రంగంలోకి అడుగు పెట్టాడు. మిగిలిన ఎడ్‌కంపెనీల కంటే తక్కువ ఫీజు ఆఫర్‌ చేయడం, అప్పటికే మార్కెట్‌లో అలోఖ్‌కి ఉన్న ఇమేజ్‌తో తక్కువకాలంలోనే ఫిజిక్స్‌వాలా సక్సెస్‌ అయింది

రెంళ్లు గడిచే సరికి ఫిజిక్స్‌వాలా స్టార్టప్‌కి పది లక్షల మంది పెయిడ్‌ విద్యార్థులు ఎన్‌రోల్‌ అయ్యారు. గంటల కొద్ది పాఠాలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. లాభాల పరంపర మొదలైంది. తొలి ఏడాది రూ.9 కోట్ల లాభం రాగా మలి ఏడాది రూ.24 కోట్ల లాభం నమోదు చేసింది. ఇన్వెస్టర్ల కన్ను పడింది. వెంటనే పెట్టుబడులు జల్లు షురూ అయింది. తాజాగా జరుగుతున్న చర్చలతో గ్లోబల్‌ ఇన్వెస్టర్ల నుంచి వంద మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు హామీ సాధించింది. ఈ నిధులు కనుక వస్తే యూనికార్న్‌ హోదా సాధించిన ఏడో ఎడ్‌టెక్‌ కంపెనీగా ఫిజిక్స్‌వాలా రికార్డుల కెక్కుతుంది.

చిన్నతనంలోనే ఇండిపెండెంట్‌గా బతకాలన్న తన ఆలోచన.. ఆర్థికపరంగా స్థిరత్వం లేని కుటుంబ పరిస్థితులు.. ఐఐటీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అలఖ్‌ని కుబేరుణ్ని చేశాయి. ఎన్ని ఆఫర్లు వస్తున్నా.. తన కాళ్ల మీద తాను నిలబడాలని.. ఒకరి కింద పనిచేయడం కంటే తాను మొదలుపెట్టిన పనిని తానే ముందుకు తీసుకెళ్లాలన్న తపన అతణ్ని ఓ ఉద్యోగిగా కాకుండా సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌ని చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version