మీరెప్పుడైనా బాండ్ సినిమాలు చూశారా? హీరో గ్రాండ్ ఎంట్రీ. పవర్ ఫుల్ విలన్. ప్రతి క్యారెక్టర్‌కు ఒక్కో టాలెంట్. చివరి వరకు ఉత్కంఠ. ఒకటే సస్పెన్స్. నెక్ట్స్ సీన్ లో ఏం జరుగుతుందోనన్న ఉత్సుకత. ఒకరిని మించి ఒకరు ప్లాన్స్. ఛేదనలు. మధ్యలో ఎమోషన్స్. అబ్బో… ఇక ఎలక్ర్టానిక్ గ్యాడ్జెట్ల సంగతి చెప్పనక్కర్లేదు. అదే టెంపో. మధ్యలో ఎక్కడా బ్రేక్ ఉండదు. హీరో గెలుస్తాడు. కానీ.. శుభం కార్డు పడదు.మళ్లీ దానికో పార్ట్ 2 అంటూ ఊరింపు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ చేరిక మరో బాండ్ సినిమాను తలపిస్తోంది. మరి హీరో ఎవరు? విలన్ ఎవరు? జీరో ఎవరు? ఎన్నెన్నో అనుమానాలు. ఎన్నెన్నో ప్రశ్నలు. అసలు ఏం జరుగుతుంది? అనే టెన్షన్. బీజేపీ ఏజెంట్ అని ఒకరు. కేసీఆర్ ఏజెంట్ అని మరొకరు. కాంగ్రెస్ తన గోతి తానే తవ్వుకుంటోందని.. బీజేపీ ఉచ్చులో చిక్కుకొందని మరొకరు. తెలంగాణలో కేసీఆర్ కు లాభమని..రేవంత్ పని అయిపోయినట్లేనని ఇంకొకరు.
కేసీఆర్.. హస్తానికి షేక్ హ్యాండిస్తే నష్టమేమిటి? ఇవ్వకపోతే లాభమేంటి? ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టనున్న కేసీఆర్? తెలంగాణా కాంగ్రెస్ ని జీరో చేయొచ్చు. బీజేపీపై వార్ స్పీడ్ ను మరింత స్పీడ్ చేయొచ్చు. కాంగ్రెస్ కు కూడా కేసీఆర్ కావాల్సిందే.రాష్ట్రంలో కేసీఆర్ బీజేపీపై పోరాడుతారు. కేంద్రంలో కాంగ్రెస్ పోరాడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ను కాపాడటం కంటే.. ఢిల్లీలో కాంగ్రెస్ ను కాపాడడమే ముఖ్యం. ఇలాంటి విశ్లేషణలు ఎన్నో.
రేవంత్ వర్గానికి బ్యాడ్ న్యూస్. రేవంత్ వ్యతిరేక వర్గానికి గుడ్ న్యూస్. రేవంత్ సీఎం ఆశలు గల్లంతే. ఆయన పరిస్థితి కుడితిలో పడ్డట్లే. కాంగ్రెస్, బీజేపీలు రెండు తిమింగలాల వంటివే..వాటివి ధృతరాష్ట్ర కౌగిలి వంటిది. ప్రేమతో కావలించుకున్నా.. పగతో కావలించుకున్నా భూస్థాపితమే. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటే.. భవిష్యత్తులో ఇక్కట్లు తప్పవు. ఇలాంటి కథనాలు ఎన్నో..
మరి సినిమాకు తెరపడేదెప్పుడు? శుభం కార్డు పడేదెప్పుడు? రేపు జరిగే టీఆర్ఎస్ ప్లీనరీలో కొంత క్లారిటీ రావొచ్చు. మరో రెండు రోజుల తర్వాత రాజస్థాన్ జైపూర్ లో జరిగే కాంగ్రెస్ ‘చింతన్ బైఠక్’ తేల్చేయవచ్చు. అప్పటి వరకు ఈ సస్పెన్స్ కంటిన్యూ…!