మామూలుగా మనం ఇంట్లో వాడే ప్లాస్టిక్ బకెట్ ధర రూ. 150 నుంచి మొదలవుతుంది. ఎంత క్వాలిటీ ప్లాస్టిక్ బకెట్ అయినా.. ధర సుమారు వెయ్యి రూపాయలు దాటదు. అయితే.. ‘బీవైమాల్ ప్లాస్టిక్ బకెట్’ ఎంఆర్పీ రూ.33,691.84. దీనిపై 38 శాతం తగ్గింపు ఇస్తున్నారు. దీంతో రూ.21,057కే ఈ బకెట్ ను సొంతం చేసుకోవచ్చు. వినడానికి, చూడ్డానికి కూడా ఇది విడ్డూరంగా అనిపించక మానదు. మరి ఇంత ధర పెట్టడం ఎందుకు? అన్న సందేహం రావచ్చు. ఇక్కడ రెండు అంశాలు ఉండి ఉంటాయి. ఒకటి సాంకేతిక లోపం కారణంగా ధర ఇలా దర్శనం ఇస్తుండొచ్చు. రెండోది.. సాంకేతిక లోటుపాట్లను సొమ్ము చేసుకునేందుకు సెల్లర్ ఇలా అధిక ధర పెట్టి ఉండొచ్చు.
కొన్ని సందర్భాల్లో హడావిడిగా షాపింగ్ చేసే వారు ఉంటారు. ఆ తరుణంలో పొరపాటుగా ఒకటి, రెండు ఆర్డర్లు వచ్చినా బాగానే మిగులుతుందన్న ఉద్దేశ్యంతో సెల్లర్ ఇలా ట్రిక్ పాటించి ఉండొచ్చు. దీనివల్ల కొనేవారు పెద్దగా ఉండరుగా… విక్రేతకు నష్టమే కదా..? అన్న సందేహం కూడా వస్తుంది. అయితే.. ఇలాంటి వింతలకు అమెజాన్ వేదికగా ఉందని చెప్పుకోవచ్చు. ట్విట్టర్ యూజర్లు భారీ ధరలతో కూడిన ఉత్పత్తుల స్క్రీన్ షాట్లను పంచుకుని కామెంట్లు పెడుతున్నారు.