కరోనా మహమ్మారికి తోడు అస్సాంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలను వరదలు నిరాశ్రయులుగా మార్చాయి. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అసలే కరోనా వల్ల ప్రజలు భయాందోళనలు చెందుతుంటే.. అస్సాంలో వరదలు ప్రజలలో ప్రాణ భయాన్ని నింపుతున్నాయి. వరదల వల్ల ఆ రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 54 లక్షల మందిపై ప్రభావం పడింది. మొత్తం 107 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ప్రధాని మోదీ స్పందించారు. ఆదివారం ఆయన అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్‌తో మాట్లాడారు. అస్సాంకు కావల్సిన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
అస్సాం సీఎం సోనోవాల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వరద బాధితులు, కోవిడ్ బాధితులకు, బాఘ్‌జాన్ ఆయిల్ వెల్ అగ్నిప్రమాద బాధితులకు సహాయం చేస్తామని మాటిచ్చారని తెలిపారు. రాష్ట్రానికి కావల్సిన సహాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారని.. అన్నారు. కాగా వరద ప్రవాహం వల్ల 18 మంది చనిపోగా, నీట మునిగి 81 మంది చనిపోయారు. మరో 26 మంది కొండ చరియలు విరిగి పడడం మూలంగా చనిపోయారు.
ఇక అస్సాం ప్రభుత్వం ఇప్పటికే విపత్తు సహాయం కింద ప్రజలకు 99,176 క్వింటాళ్ల బియ్యం, 19,397 క్వింటాళ్ల పప్పు ధాన్యాలు, 1,73,006 లీటర్ల మంచి నూనెను పంపిణీ చేసింది. వరదల వల్ల అస్సాంలో మొత్తం 200 ఎంబ్యాంక్‌మెంట్లు, 167 బ్రిడ్జిలు, క్వలర్టులు, 1600 రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.