కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హవాలా రూపంలో గత ఏడాది నుంచి ఇప్పటిదాకా దాదాపు 180 కేజీల బంగారం అక్రమ రవాణా జరిగినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దాదాపు 13 సార్లు విమానాల ద్వారా బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని భావిస్తున్నారు. ఈ కేసులో సరిత్, స్వప్న సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్‌లను ఎన్ఐఏ నిందితులుగా గుర్తించింది. కాగా, తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్లో 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్నా సురేష్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో స్వప్నా సురేష్‌తో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలపడంతో కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకు అప్పజెప్పింది.