ఈనెల 8న హైదరాబాద్కు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. మోదీ రాకను పురస్కరించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ముస్తాబు చేస్తున్నారు. ఈనెల 8న బోయిగూడ వైపు ఉన్న పదో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచే.. వందేభారత్‌తో పాటు ఎంఎంటీఎస్ రెండోదశనూ ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఇందుకు స్థానికంగా వేదిక సిద్ధం చేయడంతోపాటు ప్లాట్‌ఫామ్ 10, 9లను శుభ్రంచేసే పనులు వేగంగా జరుగుతున్నాయని సికింద్రాబాద్ స్టేషన్ మేనేజర్ రాజనర్సు చెప్పారు. భారీ బందోబస్తు ఏర్పాటుపై పోలీసులు కూడా దృష్టి సారించారు.
మరోవైపు పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభకూ సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. ఎండను తట్టుకునేలా కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేస్తుండగా.. వర్షం పడినా ఇబ్బందుల్లేకుండా షెడ్డులు నిర్మిస్తున్నారు. పరేడ్ మైదానం పశ్చిమ ద్వారం నుంచి నేరుగా వేదికవద్దకు ప్రధాని వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక కోసం జర్మన్ షెడ్డును, దానికెదురుగా 20 వేలమంది కూర్చునేలా మరో నాలుగు షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు.