ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే. అందులో భాగంగానే ఆయన వారితో అనేక అంశాలు చర్చించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ చర్చల్లో భాగంగా మోదీ పలు విషయాలపై స్పష్టత ఇచ్చారు. ఇకపై దేశంలో లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అన్‌లాక్ 1.0 నడుస్తుందని, అన్‌లాక్ 2.0ను ఎలా అమలు చేయాలనే దానిపై దృష్టి సారించాలని సీఎంలకు మార్గ నిర్దేశం చేశారు. అయితే జూన్ 30 వరకు అన్‌లాక్ 1.0 ముగుస్తున్న నేపథ్యంలో జూలై 1 నుంచి అన్‌లాక్ 2.0 ను ఎలా అమలు చేస్తారనే విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ జూలై 1 నుంచి కరోనా కట్టడికి 10 పాయింట్ల ఫార్ములాను అనుసరించేలా సూచనలు చేస్తారని తెలిసింది. ఆ పాయింట్లు ఏమిటంటే…
1. ఇకపై దేశంలో ఎలాంటి లాక్‌డౌన్‌లు ఉండవు. అన్‌లాక్ దశలే కొనసాగుతాయి. వాటిని ఎలా అమలు చేయాలనే దానిపై దృష్టి సారించాలి.
2. ఇప్పటికే ప్రారంభమైన కార్యకలాపాలకు తోడు మరిన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూడాలి. ఆర్థికపరమైన కార్యకలాపాలు అన్నీ మళ్లీ ప్రారంభం అయ్యేలా చూడాలి.
3. పెట్టుబడులను ప్రోత్సహించాలి. వ్యాపార, ఉద్యోగ అవకాశాలను సృష్టించాలి.
4. కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగించాలి.
5. కరోనా పట్ల ప్రజల్లో ఉండే అపోహలను తొలగించాలి. ఆ వైరస్ వల్ల భయపడాల్సిన పనిలేదనే విషయాన్ని వారికి చెప్పాలి. కరోనా నుంచి నిత్యం ఎంత మంది కోలుకుంటున్నారో సంఖ్యలతో సహా తెలియజేయాలి. ప్రజల్లో ఇది నమ్మకాన్ని కలిగిస్తుంది. వారిలో కరోనా పట్ల ఉన్న భయాలను తొలగిస్తుంది.
6. ట్రేస్, ట్రాక్, ఐసొలేట్ (జాడ కనిపెట్టడం, నిఘా ఉంచడం, ప్రత్యేకంగా ఉంచడం, చికిత్స అందించడం) పద్ధతిలో కరోనాపై వేగంగా పోరాటం చేయవచ్చు.
7. హెల్ప్‌లైన్ నంబర్లను ప్రజలు మరింత ఎక్కువగా ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలి.
8. ఆరోగ్య సేతు యాప్‌ను ఎక్కువ మంది వాడేలా అవగాహన కల్పించాలి. అది వాడుతున్న చోట్ల పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి.
9. టెలి మెడిసిన్ ద్వారా ప్రజలు వైద్య సేవలను ఉపయోగించుకునేలా విస్తృతమైన డాక్టర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. కరోనాపై హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముందుకు వచ్చేలా యువ ఔత్సాహికులైన వాలంటీర్ల సేవలను తీసుకోవాలి. వారిని ఆ పని చేసేలా ప్రోత్సహించాలి.
10. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న చోట మరిన్ని కఠినమైన చర్యలు చేపట్టాలి.
అయితే జూలై 1 నుంచి అన్‌లాక్ 2.0 ప్రారంభం కానున్న నేపథ్యంలో మోదీ అప్పటి వరకు ఎలాంటి సూచనలు చేస్తారో చూడాలి. కాగా దేశంలో మరోవైపు రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,974 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,54,065కు చేరుకుంది. మొత్తం 11,903 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల సమయంలో 2003 మరణాలు చోటు చేసుకోగా అందులో మహారాష్ట్రలోనే 1409 మరణాలు సంభవించాయి. దీంతో అక్కడి మరణాల సంఖ్య 5,537కు చేరుకుంది. అనంతరం 1,837 మరణాలతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది.