ఏపీలో రాజధానుల అంశం.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా భారీ ఎత్తున వివాదం కావడం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న అమరావతి కారణంగా అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృత మవుతుందని, దీనివల్ల భవిష్యత్తులో వేర్పాటు వాదానికి బీజం పడుతుందన్నది జగన్ ప్రభుత్వం ఆలోచన. అదే సమయంలో ప్రస్తుతం డిజైన్ చేసిన అమరావతి రాజధానికి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని, అంత సొమ్ము తమదగ్గర లేదని.. సో..పాలన వికేంద్రీకరణ ద్వారా మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నా మని జగన్ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు.
అయితే, దీనివల్ల అమరావతి రూపు రేఖలు మారిపోతాయని టీడీపీ సహా మిగిలిన పార్టీలు గడిచిన 50 రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులపైనే ముందుకు వెళ్తోంది. ఇదిలావుంటే, టీడీపీ ఎంపీలు సహా ఇతర పరివా రం అంతా కూడా అమరావతిని అన్ని విధాలా కాపాడుకునేందుకు, మూడు రాజధానులను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ విషయాన్ని పార్లమెంటులోనూ లేవనెత్తారు.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. ఏపీలో రాజధాని విషయంపై కేంద్రం వైఖరిని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్రం లోక్‌సభలోనే సమాధానం చెప్పింది. రాజధానిపై నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. 2015లో అమరావతిని ఏపీ రాజధానిగా నోటిఫై చేశారని కేంద్రం గుర్తు చేసింది. 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని మీడియా రిపోర్ట్ చూశామని సమాధానం ఇచ్చింది.
అంటే.. దాదాపు కేంద్రం ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది. తమకు సంబంధం లేదని చెప్పకనే చెప్పింది. దీంతో ఈ విషయంలో జగన్ ప్రభుత్వం నెగ్గిందా ? బాబు వ్యూహం ఓడిందా ? అనే చర్చ తెరమీదికి వచ్చింది. వెంటనే మేల్కొన్న టీడీపీ గణం.. తమకు ఎలాంటి అపవాదు రాకుండా చూసుకునేందుకు అప్పుడే చర్యలు చేపట్టింది. రాజధానిగా అమరావతిని ఎప్పుడో చంద్రబాబు ప్రభుత్వంలోనే నోటిఫై చేశారనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం దేశ పటంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించిందన్నారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర పరిధిలో ఎప్పుడో జరిగిపోయిందని, ఇది ముగిసిన అధ్యాయమని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. అంటే.. కేంద్రం చేసిన ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబు తమకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి కేంద్రం క్లారిటీ ఇచ్చినా.. అస్పష్టత కొనసాగుతుండడం గమనార్హం.