చంద్రయాన్ 2 ను శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పెస్ సెంటర్ నుంచి జూలై 22, 2019న ప్రయోగించారు. అహోరాత్రులు శ్రమించి రూపొందించిన చంద్రయాన్ 2 సెప్టెంబర్ 7న సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విక్రమ్ ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ నిలిచిపోయింది. చంద్రయాన్ 2 ప్రాజెక్టు కోసం దాదాపుగా 14 కోట్ల డాలర్లు.. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేసినారు. అన్ని దశలను విజయవంతంగా దాటుకుంటూ జాబిల్లి వైపు దూసుకుపోయిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విజయవంతం కాలేక పోయింది. దీంతో ఇస్రో చైర్మన్ శివన్, శాస్త్రవేత్తలు నిరాశలో మునిగిపోయారు.
దీంతో శాస్త్రవేత్తలకు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ప్రధాని మోడీ బెంగుళూరులోనే ఉండి అంతా పర్యవేక్షించారు. శాస్త్రవేత్తలకు అండగా ఉంటూ శనివారం ఉదయం 8గంటలకు శాస్త్రవేత్తలను, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్ 2 ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాలతో కమ్యూనికేషన్ అందకపోవడంతో చందమామకు కేవలం 2.1 కి.మీ. దూరంలో నిలిచిపోయిన నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బెంగుళూరులోని ఇస్రో సెంటర్ నుంచి యావత్ భారతజాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రధాని మోడీ శాస్త్రవేత్తలను జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇలా సాగింది… శాస్త్రవేత్తలు భారతమాత తలెత్తుకునేలా కృషి చేశారని, శాస్త్రవేత్తల శ్రమ వృదా కాదని, భరతమాత బిడ్డల కలలను సాకారం చేసే దిశగా పని చేశారని, జాతి గర్వపడేలా శాస్త్రవేత్తలు తమ శక్తినంతా ధారపోసారని ప్రధానమంత్రి మోడీ కొనియాడారు. నిరాశ చెందవద్దు.. మరిన్ని లక్ష్యాలు సాధించాల్సి ఉంది.. దీన్ని పరాజయంగా భావించరాదు… ప్రతి సమస్య మనకు కొత్త పాఠాలు తెలుపుతుందని మోడీ అన్నారు.
ఇది వెనుకడుగు మాత్రం కాదు. చంద్రయాన్ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, మూడు దశలలో చేసిన ప్రయోగంతో చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయనే విషయం కనుగొన్నారు.. ఇది విజయమే అంటూ మోడీ శాస్త్రవేత్తలను పొగిడారు. సైన్స్ లో వైఫల్యం అనే మాట లేదని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాల్సిన తరుణంలో నిరూత్సహం పడొద్దు అంటూ ధైర్యం నూరిపోశారు. చంద్రయాన్ 2పై ప్రధానమంత్రి మోడి చేసిన ప్రసంగంతో జాతి యావత్తు నిరూత్సాహం నుంచి కొత్త ఉత్సాహంతో ముందుకు పోయేందుకు తోడ్పాటు అందిస్తుందనిపించింది.