అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు.. అందులో 10 అంశాలను ప్రస్తావించారు. హెరిటేజ్ బ్యాంక్ వివరాలు, బోర్డు మీటింగ్స్ మినిట్స్ తీసుకురావాలని లోకేశ్‌ను కోరారు. హెరిటేజ్ కొన్న భూముల లావాదేవీలను కూడా సమర్పించాలని పేర్కొన్నారు. అటు విచారణ సందర్భంగా కోర్టుకు కూడా హాజరుకావాల్సి రావొచ్చని, అందుకు పూర్తిగా సహకరించాలని నోటీసుల్లో వివరించారు.
అయితే.. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లి లోకేష్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత కొంతకాలంగా నారా లోకేష్ ఢిల్లీలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆరోరా అశోకా రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్ ఉన్నారు. దీంతో సీఐడీ నోటీసులతో లోకేష్ విచారణకు హాజరుకావడానికి అమరావతికి రావాల్సి ఉంటుంది. లోకేష్ వస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఇటీవల ఏపీ హైకోర్టును లోకేష్ ఆశ్రయించారు. కానీ లోకేష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేయాలని, ఆయన విచారణకు సహకరించాలని ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో లోకేష్‌కు నోటీసులు జారీ చేసేందుకు శుక్రవారం పోలీసులు ఢిల్లీ వెళ్లారు. అనంతరం ఇవాళ లోకేష్‌కు వాట్సప్‌లో నోటీసులు పంపారు. లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయనకు సీఐడీ నోటీసులు జారీ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.