వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వహించనున్నారు. ఇప్పటివరకు అయితే ఆయన్ని పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ప్రకటించలేదు. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తర్వాత సీఎం ఎవరే విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
మాజీ సీఎం హరీశ్ రావత్, ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ గణేశ్ గోడియల్, సీఎల్పీ లీడర్ ప్రీతమ్ సింగ్, సీనియర్ నాయకులు కిశోర్ ఉపాధ్యాయ్, యశ్‌పాల్ ఆర్య, ప్రదీప్ టాంటాలతో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. అనంతరం ప్రచారం బాధ్యతలను హరీశ్ రావత్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గత కొన్ని రోజుల క్రితం పార్టీ వ్యవహార శైలిపై హరీశ్ రావత్ బహిరంగా విమర్శలు సంధించారు. రాజకీయాల నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాల అనంతరం హరీశ్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం.