తూకం చెబితే ఆమెకు కోపం, తూకం చెడగొడితే మనకు కోపం. తెలుగింటి కోడలు మనకు విదిల్చేదేమీ ఉండదు అని ఎప్పుడో తేలిపోయింది కనుక బడ్జెట్ నుంచి ఏమీ ఆశించ కూడదు. మనకు ఎన్నికలు లేవు. మన దగ్గర బీజేపీకి రోజుల్లేవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ పన్నుల రూపేణ దేశంలో అత్యంత క్రమశిక్షణతో కేంద్రానికి చెల్లిస్తున్నది ఆదాయం సమకూరుస్తున్నది తెలుగు రాష్ట్రాలే అన్న సంగతి మాత్రం మరువకండి. ఇక్కడ మాట్లాడే వీర్రాజులతోనే అన్ని తలనొప్పులు. ఇక్కడ మరియు అక్కడ మాట్లాడని వైసీపీ ఎంపీలతో అంతా తలనొప్పి!
డబ్బులుంటే సరిగా తూకం వేసి పంచాలి
అప్పులంటే సరిగా లెక్క కట్టి తిరిగి ఇవ్వాలి
అనూహ్యం అనుకునే రీతిలో వడ్డీలు ఉంటే పెట్టుబడులు వస్తాయి
బ్యాంకింగ్ రంగానికి ఊతం కావాలి.. కొత్త వెలుగు లేదా ఆశ రావాలి
ఇవేవీలేకుండా బడ్జెట్ కేవలం డిజిటల్ వాల్ కు పరిమితం కాకూడదు అన్నదే దేశ ప్రజల ఆశ మరియు ఆకాంక్ష కూడా!
ఎకనమిక్ గ్రోత్ 2017 – 18 నాడు 7శాతం..అదే 2022 – 23 నాటి 8 నుంచి 8.5శాతానికి మధ్యలో! ఇది ఒక అంచనా! దేశానికి అవసరం అయిన అంచనా అవునో కాదో కానీ నిర్మలమ్మ చెబుతున్న లెక్క ప్రకారం మనం వృద్ధిలో ఓ విధంగా లేము. ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు కన్నా మనం కాస్త తగ్గిపోయే లెక్కలు చెప్పుకుంటున్నాం. 2021- 22 నాటికి ఎకనిమిక్ గ్రోత్ తొమ్మిది శాతానికి పైగానే ఉందని అంచనా! అంటే వస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక ప్రగతి రూపంలో దేశం తగ్గిపోతుందని తేలిపోయింది. ఈ తగ్గుదల స్వల్పమే అయినా ఎందరినో ఈ కాస్త మార్పు కూడా ప్రభావితం చేయనుంది. కనుక దేశాన్ని నడిపే శక్తులు విభిన్న వాదాలు వినిపించక అందరినీ ఒకే విధంగా చూడాలి.విపత్తుల్లోనూ మరియు విషాదాల్లోనూ మరియు ఆనందాల్లోనూ!
ఇవాళ బడ్జెట్ డే.. అనగా కేంద్రం నుంచి ఏదో ఒక తీపి లేదా చేదు అందే రోజు.తీపి ఎవ్వరికి చేదు ఎవ్వరికి అన్నది నిర్థారించుకునేలోగానే ఎన్నికల రణరంగం ఒకటి ముందుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఏ విధం అయిన తాయిలాలు ప్రకటిస్తారో అన్నది ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు బీజేపీకి ఎంతో కీలకం. వీటితో పాటు ఉత్తరాఖండ్,మణిపూర్, గోవా ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
దేశాన్ని నడిపించే సత్తా ఎవరిది అన్నది ఉత్తరప్రదేశ్ ఎన్నికలే తేల్చబోతున్నాయని ఎప్పటి నుంచో ఎందరెందరో వినిపిస్తున్న మాట. దీన్నొక శాంపిల్ స్పేస్ కింద తీసుకోవాలని కూడా అంటున్నారు. మోడీ పాలనకు ఎన్ని మార్కులు వస్తాయో అన్నది కూడా ఇక్కడే తేలిపోనుంది. ఈ దశలో యూనియన్ బడ్జెట్.
ఎకనమిక్ గ్రోత్ అంటే కేవలం ఎన్నికలున్న రాష్ట్రాలకు వరాలు ఇవ్వడం కాదు అని మన మంత్రి గారికి విన్నవించాలి. ఎకనమిక్ గ్రోత్ అంటే ఏ ఒక్క ప్రాంతానికో నిధులు దండిగా కేటాయించి మిగిలిన రాష్ట్రాలకు చుక్కలు చూపించడం కాదు. ఎకనమిక్ గ్రోత్ అంటే అన్ని ప్రాంతాల వృద్ధినీ కోరుతూ దేశాన్ని ప్రగతి దారుల నడిపించడం అని అర్థం. ఆ పని ఎవ్వరు చేసినా ఆనందించాలి. దురదృష్టం ఏంటంటే ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక రీతిలో గౌరవం, నిధులు ఒనగూరుతున్నాయి. మిగిలిన ప్రాంతాలకు నిరాశే మిగులుతుంది. తూకం తప్పిన ప్రతిసారీ నవ్వుకోవాలో కన్నీరు పెట్టుకోవాలో తెలియని సందిగ్ధత.