అవార్డులు ఓకే.. నిధుల సంగతేంటి..?

నేడు (శనివారం) జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పంచాయతీలకు ప్రధాని నరేంద్ర‌ మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పురస్కారాలు అందించారు. ఇక తెలంగాణలోని స్థానిక సంస్థలకు 12 జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మోదీ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకున్నారు. తెలంగాణ పల్లెలు ప్ర‌గ‌తి ప‌థంలో నిలిచి దేశంలోనే రాష్ట్రం ఆద‌ర్శంగా నిలిచింద‌ని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

కాగా కేంద్రం పురస్కారాలిస్తుంది కానీ… నిధుల్లో కోత పెడుతోందని అన్నారు. ప్రతిభ చాటినందుకు, పనులు బాగా చేసినందుకు పూర్తి నిధులివ్వాలని, అదనంగా ఇస్తే ఇంకా సంతోషమని ఎర్ర‌బెల్లి తెలిపారు. గ్రామాల్లో కరోనా ప్ర‌బల‌కుండా కట్టడి చేసి, కరోనా విముక్తి గ్రామాలుగా మారాలన్న‌దే తమ ప్ర‌భుత్వ ధ్యేయమ‌ని అన్నారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చేవిధంగా కొత్త గ్రామ పంచాయ‌తీలు, కొత్త వార్డుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. పల్లెల అభివృద్ధికి ప్ర‌తి నెల రూ.308 కోట్లు విడుద‌ల చేస్తూ.. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.5,761 కోట్లు విడుద‌ల చేసిన్న‌ట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఈ త‌ర‌హ నిధుల‌ను గ్రామ పంచాయ‌తీల‌కు అందించ‌డం లేద‌ని అన్నారు.

15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థ‌ల‌కు విడుద‌ల చేసే నిధుల‌లో.. కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణకు రూ.699 కోట్లు కోత విధించింద‌ని… కేంద్రం కోత‌లు విధించినా.. రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రామ పంచాయ‌తీల‌కు ఎలాంటి కోతలు లేకుండా నిధుల‌ను అందిస్తుంద‌న్నారు. తొలిసారిగా ఈ సంవ‌త్స‌రం రాష్ట్ర బ‌డ్జెట్ నుండి మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ.500 కోట్ల నిధులు కేటాయించిందని అన్నారు. మిష‌న్ భ‌గీర‌థ ఆధారంగా కేంద్ర ప్ర‌భుత్వ జ‌ల్‌శ‌క్తి మిష‌న్ ప్ర‌కటించ‌డం సీఎం కేసిఆర్ కృషికి ద‌క్కిన ప్ర‌శంస‌మ‌ని మంత్రి అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల నుండి దేశంలోనే మ‌రే రాష్ట్రానికి రానన్ని అవార్డులు, ప్ర‌శంస‌లు తెలంగాణ రాష్ట్రానికి ద‌క్కాయ‌న్న మంత్రి… రాష్ట్రంలో పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంద‌న‌డానికి ఈ అవార్డులు, ప్ర‌శంస‌లే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.