పెండింగ్‌లో ఆరు స్థానాలు.. అభ్యర్థులు లేక బాబు అవస్థలో

-

ఆరు అసెంబ్లీ స్థానాలు టీడీపీకి చికాకుగా మారాయా? పోటీ చేస్తున్న 144 నియోజకవర్గాల్లో 139 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ 6 నియోజకవర్గాలను ఎందుకు వదిలేశారు? పెండింగ్ స్థానాలపై ప్రత్యేక వ్యూహం ఉందా? లేక సమర్థులు లభించకపోవడమే కారణమా? ఆరు సీట్లపై టీడీపీ చేస్తున్న కసరత్తు ఏంటి? ఆ ఆరు చోట్ల సైకిల్ స్లోగా మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటి?

టీడీపీ పెండింగ్ పెట్టిన ఆరు స్థానాల్లో దాదాపు నాలుగు చోట్ల సీనియర్ నేతలు టికెట్లు ఆశిస్తుండటం, అక్కడ ప్రత్యర్థులు బలంగా ఉండటంతో ఆచితూచి వ్యవహరిస్తోంది సైకిల్ పార్టీ. ఉత్తరాంధ్రలోని చీపురుపల్లి, భీమిలి.. దక్షిణ కోస్తాలోని భీమిలి, రాయలసీమలోని అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు, రాజంపేట స్థానాలను పెండింగ్ లో పెట్టింది.

ఈ 6 స్థానాల నుంచి టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, గుమ్మనూరు జయరాం, ప్రభాకర్ చౌదరి వంటి సీనియర్లు టికెట్లు ఆశిస్తున్నారు. అయితే.. సీనియర్లుగా చెప్పే ఈ నేతలను వారి సొంత నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాలకు మారమని అనడంతోనే సమస్య ఎదురైంది. టికెట్ల ప్రకటన పెండింగ్ పడింది. అయితే ఆ ఇద్దరి వల్ల టీడీపీకి చీపురుపల్లిలో డ్యామేజ్ జరిగిందని పార్టీ హైకమాండ్ కు రిపోర్టు రావడం ఆ నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న బొత్స ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఇదే విధంగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పరిస్థితి డోలాయమానంగా ఉంది. తన సిట్టింగ్ స్థానం ఆలూరు టికెట్ ను నిరాకరించారనే కారణంతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు జయరాం. అయితే, ఆలూరులో మహిళా నేత, కోట్ల సుజాతమ్మ అభ్యర్థనతో జయరాంకు పక్క జిల్లాలోని గుంతకల్లు సీటు ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. జయరాం కూడా ఇందుకు సిద్ధమే అన్నారు. కానీ, మూడో జాబితా విడుదల చేసినా.. అందులో జయరాం పేరు లేదు. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక మిగిలిన నియోజకవర్గాల్లో అనంతపురం అర్బన్, దర్శి, రాజంపేట స్థానాలపై మిత్రపక్షాలతో ఊగిసలాట కొనసాగుతోంది. దర్శి స్థానాన్ని జనసేన కోరుతూ ఉండగా, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబం టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సిద్ధా.. దర్శి టికెట్ ఇస్తే టీడీపీలోకి వచ్చేస్తామని సంకేతాలు పంపుతున్నట్లు చెబుతున్నారు.

ఇక అనంతపురం అర్బన్ నుంచి సీనియర్ నేత ప్రభాకర్ చౌదరి పోటీకి ఉవ్విళ్లూరుతున్నా.. ఆ స్థానాన్ని జనసేన ఆశిస్తుండటంతో పెండింగ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. రాయలసీమలోని తిరుపతి స్థానాన్ని జనసేనకు కేటాయించగా.. ఆ పార్టీ తిరుపతిని వదులుకుని అనంతపురం కావాలని కోరుతోంది అంటున్నారు. ఇక రాజంపేటలోనూ సమర్థుల కోసం అన్వేషణలో భాగంగా పెండింగ్ లో పెట్టినట్లు చెబుతున్నారు?

మొత్తానికి ఈ ఆరు సీట్లకు అభ్యర్థుల ఎంపిక అధినేతకు సవాల్ గా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆరు నియోజకవర్గాల్లో నలుగురు సీనియర్ల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news