ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న శైలిపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచడం ఇప్పుడు మద్యం మాల్స్ అంటూ కొత్త నిర్ణయం తీసుకోవడం, కొత్త ఎక్సైజ్ పాలసీని ఏపీ సర్కార్ ప్రకటించడంపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు డా. తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేసారు.
మద్య నిషేధంపై మాట జగన్ ప్రభుత్వం తప్పింది అని ఆయన విమర్శించారు. మద్యం దుకాణాలు, బార్లు చాలక మద్యం మాల్స్ కూడానా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయవనరుగా చూస్తున్నదని ఆయన మండిపడ్డారు. మూడు సార్లు మద్యంపై జేఎస్టీ(జగన్ సర్వీస్ టాక్స్)వేసిందని ఆయన అన్నారు. అక్రమ మద్యం ఏరులై పారుతున్నదని విమర్శించారు. ధర పెంచినందున మందుబాబులు తాళిబొట్టులు తాకట్టు పెడుతున్నారని, నాటుసారా తయారీ కుటీర పరిశ్రమగా మారిందని అన్నారు. మద్యనిషేధం కాదు..మద్యపాన నిషా అని ఆరోపించారు.