బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కమలం పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న కన్నా.. ఎట్టకేలకు పార్టీని వీడేందుకే సిద్ధపడినట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కావడం.. ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని వారు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అలసత్వం కారణంగానే టీడీపీకి అలాంటి అవకాశం వచ్చిందని, పార్టీ ముఖ్యనేతలపై కన్నా కాస్త కోపంగా ఉన్నారు.
సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో అంతా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాంయంతో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. సీనియర్ నేత అయిన తనకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని, తన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఇప్పటికే ఒకటి రెండు సార్లు కన్నా.. బీజేపీ అగ్రనేతల దృష్టికి తెచ్చారు. అయినా .. అధిష్ఠానం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో పార్టీకి టాటా చెప్పే యోచనలో కన్నా భావిస్తున్నట్లు సమాచారం.
తాజా పరిణామాల నేపథ్యంలో తన ముఖ్య అనుచరులతో కన్నా ఇవాళ సమావేశం కానున్నారు. 30 ఏళ్లుగా తనతోపాటు రాజకీయాల్లో కొనసాగుతోన్న 15 మంది కీలక నేతలను మాత్రమే సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అనుచరులతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.