రామోజీరావుతో ఫిలింసిటీలో చంద్రబాబు భేటీ.. వాటీస్ హాపెనింగ్?

-

ఎన్నికల ఫలితాలకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. అయితే.. ఈ వారం రోజుల్లోనే ఏదో చేసేద్దామని ప్రధాన పార్టీల నేతలు ఉన్నట్టున్నారు. అయ్యో.. మనం మాట్లాడుకునేది ఏపీ గురించి. ఏపీలో ప్రధాన పార్టీలంటే చెప్పుకోవాల్సినవి వైఎస్సార్సీపీ, టీడీపీ.

ఎగ్జిట్ పోల్స్ అన్నీ వైఎస్సార్సీపీ వైపే ఉన్నాయని ఈమధ్యే చంద్రబాబు తన మంత్రులతో చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ వైపు ఉన్నా మీరేమీ టెన్షన్ పడొద్దంటూ టీడీపీ క్యాడర్‌కు ధైర్యం చెప్పిన చంద్రబాబే ధైర్యం కోల్పోతున్నారా? లేక కోల్పోయారా? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమైతే. ఎన్నికల్లో జగన్ గెలిస్తే నా పరిస్థితి ఏంటి? అని అనుకున్నారో ఏమో.. చంద్రబాబు ఇవాళ రామోజీరావుతో భేటీ అయ్యారు. అంతకు ముందే అమరావతిలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. చంద్రబాబుతో దాదాపు గంటా 15 నిమిషాలు భేటీ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావును కలిశారు చంద్రబాబు.

ఎగ్జిట్ పోల్స్ వైఎస్సార్సీపీ వైపే ఉన్నాయని తెలిసిన మరుసటి రోజే చంద్రబాబు రామోజీరావును ఎందుకు కలిశారు. ఇదిగో.. ఇదే చర్చ ఇప్పుడు ఏపీలో. వీళ్లిద్దరు కలిసి మళ్లీ ఏ ఉపద్రవాన్ని సృష్టించబోతున్నారు. ఈ సమయంలో రామోజీరావుతో చంద్రబాబుకు ఏం పని? అని రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ల మెదడుకు బాగానే పదును పెడుతున్నారు.

రామోజీ రావు దగ్గర ఏమున్నది చెప్మా.. అని తలలు గోక్కుంటే.. ఉన్నది ఒకటే ఈనాడు పేపర్. అంతకు మించి ఇంకేమున్నాయి. చానెల్. మీడియా తప్పించి ఇంకా రామోజీ రావు దగ్గర ఏమున్నాయి. డబ్బు అంటారా? ఆ డబ్బు చంద్రబాబు దగ్గర లేదా? కోట్లకు కోట్లు మూలుగుతున్నాయి చంద్రబాబు దగ్గర. డబ్బు చంద్రబాబును సీఎం చేయలేదు కదా. మరి.. ఎందుకు రామోజీరావును కలిసినట్టు.

ఈ వారం రోజుల్లో రామోజీరావుతో ఏదైనా కొత్త సర్వే ప్లాన్ చేస్తున్నారా చంద్రబాబు. అందుకే కలిశారా? కొత్త సర్వే ప్లాన్ చేయించి.. ఈనాడులో అచ్చేయించి.. ఎగ్జిట్ పోల్స్‌లో చంద్రబాబే అధికారంలోకి వస్తారని ఈనాడు, ఈటీవీ ద్వారా చెప్పించబోతున్నారా? అలా చెప్పించినా ఏం లాభం. ఎగ్జిట్ పోల్స్‌లో గెలుస్తారని చెప్పినంత మాత్రాన నిజంగా గెలుస్తారని నమ్మకం ఏముంది.

ఏమో.. ఎగ్జిట్ పోల్స్‌లో టీడీపీ గెలుస్తుందని ఈనాడు, ఈటీవీ చెబితే… ఈవీఎంలో మాత్రం సరైన మెజారిటీ రాలేదని(ఒకవేళ రాకపోతే).. ఈవీఎంలలో ఏదో మతలబు ఉందని.. మళ్లీ ఎన్నికలు పెట్టాలంటారా ఏంది కొంపదీసి.

ఏ లేదు.. లేదు.. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పాలనుకుంటున్నారు కదా.. దాని గురించి రామోజీరావుతో మాట్లాడటానికి వచ్చి ఉంటారు.. అంటారా?

హే.. ఇవన్నీ కాదు.. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు చంద్రబాబు హాజరయ్యారు. పనిలోపనిగా… రామోజీరావుతో ఏకాంతంగా కాసేపు ముచ్చటించారు.. తప్పితే.. ఇందులో మాయా లేదు మర్మం లేదు అంటారా? అయితే మీ ఇష్టం.

కాదు.. కాదు… నిజానికి రామోజీ రావు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరినీ ఆ ఫంక్షన్‌కు పిలిచారని.. ఇద్దరూ వస్తే.. కలిసి కూర్చోబెట్టి మాట్లాడుదామని అనుకున్నారట. అయితే.. చంద్రబాబు ఫిలిం సిటీకి వెళ్లారు కానీ.. సీఎం కేసీఆర్ ఫిలిం సిటీకి వెళ్లినట్టుగా వార్తలు అయితే ఏం రాలేదు. ఏమో.. ఇంకా ఈ వారం రోజుల్లో ఏం జరగబోతుందో తెలుగు రాష్ర్టాల్లో?

Read more RELATED
Recommended to you

Exit mobile version