ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపైన డైలమా కొనసాగుతోంది.ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని సమాచారం. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. వారికిచ్చే వేతనం కూడా రూ 10 వేలకు పెంచుతామని చెప్పారు. అయితే గత రెండు నెలలుగా వాలంటీర్ల కొనసాగింపుపై అనుమానాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థకు కొత్త రూపం తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాల ప్రకటనకు సీఎం చంద్రబాబునాయుడు సిద్దమవుతున్నారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించేలా వాలంటీర్ల సేవలను గత ప్రభుత్వం వినియోగించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల సేవలను ఎలా వినియోగించుకోవాలి అనే దిశగా కసరత్తు మొదలు పెట్టింది. వాలంటీర్లు లేకుండానే సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి వద్దనే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేసింది.
మరోసారి ఆగష్టులో కూడా పెన్షన్‌లను సచివాలయ సిబ్బందితోనే పంపిణీ చేస్తోంది. ఇప్పుడు వాలంటీర్ల సేవలను సమర్ధవంతంగా ఏ విధంగా వియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రులతో సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు చర్చించి సూచనలు, సలహాలు తీసుకున్నారట. రిజైన్ చేయుండా సర్వీసులో ఉన్న వాలంటీర్ల నైపుణ్యతను పెంచేలా వారికి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. వాలంటీర్ల విద్యార్హత, వయసు ఆధారంగా వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి.. ఏ కార్యక్రమాల కు వారి సేవలు వినియోగించుకోవాలనే అంశాలపై అధ్యయనం చేస్తోంది.
ప్రస్తుతం విధుల్లో ఉన్న వాలంటీర్లలో ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. అందులో పీజీ చేసిన వారు 5 శాతం ఉండగా.. డిగ్రీ చదివిన వారు 32 శాతం ఉన్నారు. 20 -25 మధ్య వయసు ఉన్నవారు 25 శాతం, 25-30 మద్య వయసు ఉన్నవారు 34 శాతం, 31-35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 28 శాతం మంది ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు.వీరిలో ఆసక్తి ఉన్న వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి స్కిల్ నైపుణ్యం పెంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఆ విధంగా వీరి ద్వారానే ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
ఆగష్టు నెల 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా చేయగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,53,908 మంది వాలంటీర్లు ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. వాలంటీర్లకు నెలకు రూ 10 వేలు చొప్పున వేతనం చెల్లిస్తే రూ 1848 కోట్లు అవసరం అవుతుంది. అంత భారం ప్రభుత్వంపై అవసరమా… అసలు వాళ్ళను పక్కన పెట్టేస్తే పోలా అని పలువురు మంత్రులు చెప్పారట. అయితే వారికి స్కిలల్స్ నేర్పడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. మరి కేబినెట్ మీటింగ్ తరువాత ఏ నిర్ణయం చెప్పతారో వేచి చూడాల్సిందే.