గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మేకతోటి సుచరిత గెలిచారు. ఆమె సీనియర్ ఎమ్మెల్యే. ఆమె ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తర్వాతనే రోజా, పాముల పుష్ప శ్రీవాణి, విశ్వసరాయి కళావతి, వనిత లాంటి మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం ఇటీవలే కొలువు దీరిన సంగతి తెలిసిందే. మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. నిజానికి మొత్తం 14 మంది మహిళా ఎమ్మెల్యేలు ఏపీలో ఉన్నారు. వారిలో 13 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే. వాళ్లలో కేవలం ముగ్గురికి మాత్రమే మంత్రిగా చోటు దక్కింది. వాళ్లే పాముల పుష్ప శ్రీవాణి, తానేటి వనిత, మేకతోటి సుచరిత. ఈ ముగ్గురు మొన్న ఏపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
నిజానికి వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు మంత్రిగా చాన్స్ దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ఆమెకు దక్కకుండా.. ఈ ముగ్గురికి మంత్రి పదవి దక్కింది. అందులో మేకతోటి సుచరితకు హోంమంత్రి శాఖ దక్కింది. అయితే.. వీళ్లకే మంత్రి పదవి దక్కడానికి కారణం ఏంటి? వీళ్ల రాజకీయ ప్రస్థానం ఏంటి? జగన్.. ఈ ముగ్గురికే మంత్రి వర్గంలో ఎందుకు స్థానం కల్పించారు? వైఎస్సార్సీపీతో వీళ్ల ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది.. అనే విషయాలు తెలుసుకుందాం పదండి.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మేకతోటి సుచరిత గెలిచారు. ఆమె సీనియర్ ఎమ్మెల్యే. ఆమె ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తర్వాతనే రోజా, పాముల పుష్ప శ్రీవాణి, విశ్వసరాయి కళావతి, వనిత లాంటి మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు.
పాముల పుష్ప శ్రీవాణి రాజకీయ ప్రస్థానం
పాముల పుష్ప శ్రీవాణి మొదటి సారి మంత్రిగా అవకాశం చేజిక్కించుకున్నారు. ఆమె మాజీ టీచర్. ఆమెది విజయనగరం జిల్లా. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె సొంతూరు జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి కోట. అయితే.. టీచర్ వృత్తిని వదిలేసి తన భర్త ప్రోత్సహించడంతో రాజకీయాల్లోకి శ్రీవాణి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆమె రాజకీయంగా రాణిస్తున్నారు. తాజాగా ఎస్టీ మహిళా కోటా కింద మంత్రి పదవిని పొందారు. 2014 ఎన్నికల్లో కూడా శ్రీవాణి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు.
తానేటి వనిత
ఈమె రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభం అయింది. 2009లో గోపాలపురం ఎస్సీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ పార్టీ అవిర్భవించాక.. అందులో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ.. పార్టీని వీడకుండా.. పార్టీతోనే ఉండి.. పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2019లో అదే కొవ్వూరు నుంచి మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు. మంత్రి పదవిని దక్కించుకున్నారు. వనితకు కొవ్వూరు. భర్త శ్రీనివాసరావు కూడా ఆమెను రాజకీయాల్లో ప్రోత్సహించాడు. ఆమె ఎమ్మెస్సీ చదివారు.
మేకతోటి సుచరిత
మేకతోటి సుచరిత రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీగా ప్రారంభం అయింది. ముందుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ నుంచి ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. అయితే.. కాంగ్రెస్ పార్టీకి ఆమె తర్వాత రాజీనామా చేసి.. వైఎస్సార్సీపీలో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014లో మాత్రం ఓడిపోయారు. తర్వాత 2019లో గెలిచారు. ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన మహామహులను ఆమె ఓడించారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, జనసేన నుంచి పోటీ చేసిన రావెల కిషోర్ బాబును ఓడించి 7398 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆమె సీనియర్ ఎమ్మెల్యే కావడం, ఎస్సీ మహిళ కోటాలో ఏకంగా హోంమంత్రి పదవినే దక్కించుకున్నారు.