ఎల్లుండి నుంచే ఏపీ ఎంసెట్ (ఈఏపీ సెట్) పరీక్షలు… వారికి నో ఎంట్రీ !

అమరావతి : ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల పై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి జరుగబోయే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉంటాయని పేర్కొన్న విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఏపీ ఈఏపీ సెట్ కు 2,59,156 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇక ఏపీ, తెలంగాణాల్లో ఈ పరీక్షల కోసం 120 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్ధులను పరీక్షకు హాజరు కావటానికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్ధులకు పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలో త్వరలోనే చెబుతామన్నారు. ఆగష్టు 25న ఇంజనీరింగ్ విభాగ ప్రాధమిక కీ విడుదల చేస్తామని వెల్లడించారు ఆదిమూలపు సురేష్.