వైసీపీలో కీల‌క నేత‌ల వార్‌… మంత్రి వ‌ర్సెస్ సీనియ‌ర్‌

-

ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు అయ్యిందో లేదో చాలా జిల్లాల్లో కీల‌క నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య యుద్ధం కోసం ఎత్తులు, పై ఎత్తులు స్టార్ట్ అయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ ఈ గ్రూపుల గోల జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇదిలా ఉంటే విశాఖ జిల్లా రాజకీయాల్లో మంత్రి వ‌ర్సెస్ సీనియ‌ర్ నేత మ‌ధ్య జ‌రుగుతోన్న పోరు ఇప్పుడు పార్టీ శ్రేణుల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. విశాఖ జిల్లా రాజ‌కీయాల్లో వైసీపీ సీనియ‌ర్ నేత అయిన ద్రోణంరాజు కుటుంబానికి విశేష ప్రాధాన్యత ఉంది.

ఐదు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్న ఆ కుటుంబానికి అక్క‌డ మంచి ఇమేజ్ ఉంది. స్వాతంత్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాధాన్ని లోక్ సభ ఎన్నికల్లో ఓడించిన దివంగత ద్రోణంరాజు సత్యనారాయ‌ణ నాలుగు దశాబ్దాల పాటు విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆయ‌న విశ్వ‌నాథాన్ని ఓడించ‌డం ద్వారా ట్రెండ్ సెట్ చేశారు. అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రుల‌తో సైతం ఆయ‌న‌కు ఎంతో చ‌నువు ఉండేది.

ఇదిలా ఉంటే ఆయ‌న త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్ రెండుసార్లు కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచారు. వివాద ర‌హితుడు, సౌమ్యుడిగా పేరున్న ఆయ‌న గ‌త ఎన్నిక‌లకు ముందే వైసీపీలోకి జంప్ చేసి విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా జ‌గ‌న్ ఆయ‌న‌పై ఉన్న న‌మ్మ‌కంతో
విశాఖ మెట్రో రీజియన్ డెవలెప్ మెంట్ అధారిటీ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆయ‌న‌కు జిల్లాకే చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌కు అస్స‌లు ప‌డ‌డం లేదు.

ఎన్నికల ముందు ఇద్దరు ఉద్దండులు ఒకేసారి వైసీపీలో చేరారు. వీరిలో శ్రీనివాస్ ఓడిపోగా… భీమిలిలో గెలిచిన అవంతి మంత్రి అయ్యారు. అప్ప‌టి నుంచి శ్రీనివాస్‌కు కూడా ప‌ద‌వి రావ‌డంతో అవంతి కాస్త అస‌హ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బ‌హిరంగ వేదిక‌ల మీదే ఒక‌రికి ఒక‌రు కౌంట‌ర్లు ఇచ్చుకుంటున్నారు. వీరి మ‌ధ్య ఉన్న అస‌హ‌నం ఓ సారి బ‌య‌ట‌ప‌డిపోయింది. శ్రీనివాస్‌కు ప‌ల్లె ప్రాంతాలు, గ్రామీణ స‌మ‌స్య‌లు తెలియ‌వ‌న్న‌ట్టుగా అవంతి మాట్లాడారు. వెంట‌నే కౌంట‌ర్‌గా శ్రీనివాస్ తాను జుత్తాడ గ్రామం నుంచి వచ్చానని, పక్కా లోకల్ అని చెప్పారు.

అదే వేదిక‌పై అవంతి ఎక్క‌డ నుంచి విశాఖ‌కు వ‌చ్చారో ఎవ్వ‌రికి తెలియ‌ద‌ని… ఆయ‌న వ్యాపారం కోస‌మే విశాఖ‌కు వ‌ల‌స వ‌చ్చార‌ని ఘాటైన కౌంట‌ర్ ఇచ్చారు. త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ఏదేమైనా ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న వార్ ఇప్పుడు జిల్లా వైసీపీ శ్రేణుల‌కు త‌ల‌నొప్పిగా మారింది. మ‌రి ఈ వివాదం ఎలా ?  మ‌లుపులు తిరుగుతుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news