ఈటలకు బాల్క సుమన్ సవాల్ : యువకుడిని పెట్టి నిన్ను ఓడిస్తాం!

ఈటలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ సవాల్‌ విసిరారు. ఈటలపై పోటీకి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఓ యువకుడిని పెట్టి ఓడిస్తామని స్పష్టం చేశారు బాల్క సుమన్‌. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో సోషల్ మీడియా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. తండ్రి లాంటి కేసీఆర్ నిన్ను కొడుకుల.. ఓ తమ్ముడా చూసుకున్నాడని గుర్తు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు బిజెపి పార్టీ లోకి ఎందుకు వెళ్లారు అనే దానిపై ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ సంఘాలతో ఎందుకు మంతనాలు జరిపారు… రెవిన్యూ సంఘాలతో రహస్య మీటింగ్ లు ఎందుకు పెట్టారు అని నిలదీశారు. అన్నం పెట్టే వాళ్లకే.. సున్నం పెట్టారని..కడుపులో కత్తులు పెట్టుకుని బయట నవ్వులతో ఎలా మాట్లాడారని ప్రశ్నించారు బాల్క సుమన్‌. ఎన్నో పదవులు అనుభవించి… టీఆర్‌ఎస్‌ను ఇప్పుడు విమర్శించడం చాలా దారుణమన్నారు. కాగా.. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కౌశిక్‌ రెడ్డి ఇప్పటికే నిర్ధారణ కాగా… ఇంకా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది.