ఆ నిర్ణ‌యంతోనే బంగ్లాదేశ్‌లో ర‌చ్చ‌.. ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడ‌లేదంటున్న విశ్లేష‌కులు

-

ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు ప్ర‌జామోద‌యోగ్యంగా ఉండాలి. కాదు అంటే పెద్ద ఎత్తున విధ్వంస‌కాండ త‌ప్ప‌దు. దీనికి తాజా ఉదాహ‌ర‌ణే మ‌న పొరుగున ఉన్న బంగ్లాదేశ్. ప్ర‌భుత్వం తీసుకున్న ఓ నిర్ణ‌యంతో కేవ‌లం రెండురోజుల్లో ప‌రిస్థితులు త‌లికందులు అయ్యాయి ఆ దేశంలో.ఇప్ప‌టికీ బంగ్లాదేశ్‌లో విధ్వంసకాండ కంటిన్యూ అవుతోంది. అల్లర్లలో అట్టుడికిపోతోంది. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన మంలు ఆ దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మార‌డంతో ఆందోళనకారుల్ని కంట్రోల్ చేయ‌లేక సైన్యం చేతులెత్తేసింది.

ఇప్పటివరకు 400మందికి పైగా బంగ్లాపౌరులు ప్రాణాలు కోల్పోయారు.హిందువులు సైతం అకార‌ణంగా ఘోరంగా హ‌త్య‌కు గుర‌వుతున్నాన్నారు. ప్ర‌ధాని షేక్ హ‌సీనా ఇంటిలో చొర‌బ‌డిన‌ ఆందోళనకారులు కుర్చీలు, టేబుళ్లు, పూలబొకేలు అన్నిటినీ ఎత్తుకెళ్లిపోయారు. పరుపులు, ఫ్యాన్లతో స‌హా ఏది కనిపిస్తే అది దోచుకెళ్లారు. ఆ దేశ జాతిపిత, షేక్‌ హసీనా తండ్రి షేక్‌ ముజీబుర్‌ రహమాన్‌ విగ్రహాన్ని ఢాకాలో అల్లరిమూకలు క‌సిగా ధ్వంసం చేశాయి.

బంగ్లాదేశ్ ఇంత అల్ల‌క‌ల్లోలంగా మార‌డానికి రిజ‌ర్వేష‌న్‌లే కార‌ణం.అక్క‌డి స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. హసీనా నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్నాళ్లుగా దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. 30శాతం రిజర్వేషన్లను 5శాతానికి కుదించాలని అటు సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. దీంతో బంగ్లాలో ఆందోళ‌న‌కారులు రెచ్చిపోయారు. చివరికి షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయే ప‌రిస్థితులు దారితీశాయి.

కేవ‌లం రెండు రోజుల్లోనే బంగ్లాలో పరిస్థితులు అదుపుతప్పాయి. ఢాకాలో రోడ్డెక్కిన లక్షలాది మంది జనం విధ్వంసం సృష్టించారు. మంత్రుల ఇళ్లు, అధికారిక నివాసాలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, బస్సులకు నిప్పుపెట్టారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌తో ప్ర‌ధాని షేక్ హ‌సీనా దేశాన్ని వ‌దిలి వెళ్ళిపోయారు. దీంతో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా అక్క‌డి సైన్యం చ‌ర్చ‌లు చేప‌ట్టింది. ఐక్యరాజ్యసమితి సైతం బంగ్లాదేశ్‌ పరిణామాలను ఎప్పటి కప్పుడు గమనిస్తోంది. త్వరలోనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటోన్న ఆర్మీ చీఫ్‌… శాంతి స్థాపన కోసం విద్యార్థి సంఘాలతో చర్చలు జరుపుతున్నారు.

బంగ్లాలో ఈ త‌ర‌హా ర‌చ్చ జ‌ర‌గ‌డం ఇది తొలిసారి కాదు.49ఏళ్ల క్రితం 1975 ఆగస్టులో రాజ‌కీయ సంక్షోభాన్ని ఎదుర్కొంది ఆ దేశం. ప్రస్తుత ప్రధాని హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహ్మన్‌, అతని ఫ్యామిలీతోపాటు.. 18 సీనియర్‌ సైనికాధికారులను హత్య చేశారు దుండగులు. దాంతో.. హసీనా, ఆమె భర్త, పిల్లలు ఢిల్లీలో ఉండేందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సాయం చేసింది. ఇప్పుడు కూడా షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించింది భారత్‌. బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచే షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ కుమార్తె.. షేక్ హసీనా. ముజిబుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్‌కు తొలి అధ్యక్షుడు.

ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని నెలలకే.. అంటే 1975 ఆగస్టు 15న హత్యకు గురయ్యారు. ముజిబుర్‌తో పాటు హసీనా తల్లిని, ముగ్గురు సోదరులను సైనికాధికారులు హత్య చేశారు. ఈ హత్యలు జరిగినప్పుడు హసీనా వయసు ఆరేళ్లు. అప్పుడు ఆమె బంగ్లాదేశ్‌లో లేకపోవడంతో ప్రాణాలు దక్కాయి. 1981లో ఆమె బంగ్లాదేశ్ తిరిగి వచ్చాక రాజకీయాల్లో కీలక నాయకురాలిగా మారారు. 1991లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీకి మెజారిటీ లభించలేదు. ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించటంతో హసీనా తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు. బంగ్లాదేశ్ ఆమె ఇప్పుడు నాలుగోసారి ప్ర‌ధానిగా కొన‌సాగుతున్నారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా షేక్ హసీనాకు రికార్డ్ ఉంది. ప్ర‌స్తుతం ఆ దేశంలో నెల‌కొన్న సంక్షోభం దృష్ట్య ఎవ‌రైనా కుట్ర‌లు చేస్తున్నారా అనే కోణంలో విచార‌ణ‌లు కూడా జ‌రుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news