బెజవాడ పాలిట్రిక్స్: బాబుకు బుద్దా వర్గం షాక్ ఇవ్వనుందా?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు..పార్టీలో ఊహించని మార్పులు తీసుకొస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలని ఫిక్స్ చేయడమే లక్ష్యంగా వెళుతున్నారు. ఈ సారి మొహమాటం పడకుండా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. నాయకులు అలిగిన కూడా పట్టించుకునే స్థాయిలో లేరు. పార్టీ భవిష్యత్ మాత్రమే ముఖ్యమన్నట్లు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పులు చేశారు.

chandrababu

అలాగే విజయవాడ(బెజవాడ)లో కీలకంగా ఉన్న వెస్ట్ నియోజకవర్గం బాధ్యతలని ఎంపీ కేశినేని నానికి అప్పగించారు. ఒక ఇంచార్జ్‌ని పెట్టకుండా కేశినేనిని సమన్వయకర్తగా నియమించారు. ఇక ఇక్కడ నుంచే బెజవాడ టీడీపీలో రచ్చ మొదలైంది. కేశినేనికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న వర్గం పావులు కదుపుతుంది. అయితే ఈ నియోజకవర్గం జలీల్ ఖాన్ చేతిలో ఉంది. కానీ ఆయనకు వయసు మీద పడటంతో యాక్టివ్‌గా ఉండటం లేదు.

దీంతో వెస్ట్ సీటు కోసం బుద్దా వర్గం గట్టిగా ట్రై చేసింది. బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు ఈ సీటు దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు ఈ సీటు ఎవరికి ఇవ్వకుండా కేశినేనిని సమన్వయకర్తగా నియమించారు. దీంతో నియోజకవర్గంలో బుద్దా వర్గం సరికొత్త రాజకీయానికి తెరలేపింది. బీసీ, మైనారిటీలకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. తాజాగా వెస్ట్‌లో బుద్దా వర్గం ఆందోళన కూడా చేసింది.

అయితే బుద్దా వర్గం ఆందోళనని బాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో కొందరు నేతలు సైడ్ అయిపోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. నగరంలో పూర్తి పెత్తనం కేశినేనికే అప్పగించడంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇంకా పార్టీలో ఉన్న లాభం లేదని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే బుద్దా వర్గంలోని కొందరు నేతలు బాబుకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలిసింది.