కుప్పంపై భువనేశ్వరి ఫోకస్..వైసీపీ ఎంత పనిచేసింది?

-

చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఎలా ఫోకస్ పెట్టి రాజకీయం నడిపిస్తుందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే అక్కడ టి‌డి‌పిని దెబ్బతీసి బలోపేతం అవుతూ వస్తుంది. అటు స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీని సైతం కైవసం చేసుకోవాలని చెప్పి వైసీపీ ప్లాన్ చేస్తుంది.

ఆ దిశగానే ముందుకెళుతుంది. ఇప్పటికే భరత్‌ని అభ్యర్ధిగా ప్రకటించారు. అలాగే గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి కుప్పంలో పనిచేస్తున్నారు. అక్కడ వైసీపీ బలం పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో బాబుకు కూడా టెన్షన్ మొదలైంది. కుప్పం ప్రజలు ఎక్కడ వైసీపీ వైపు వెళ్తారనే డౌట్ తో బాబు కూడా కుప్పంపై ఫోకస్ పెట్టారు. అప్పుడప్పుడు అక్కడకు వస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అసలు నామినేషన్ వేయడానికి కూడా రాకుండా..కార్యకర్తల చేత నామినేషన్ వేయించే బాబు..ఇప్పుడు కుప్పం అడపాదడపా వస్తున్నారు. అలాగే అక్కడ ఇల్లు కూడా కట్టుకుంటున్నారు.

ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ని అక్కడ పెట్టి పనిచేయిస్తున్నారు. ఇదే క్రమంలో నారా భువనేశ్వరి సైతం కుప్పం పర్యటనకు వచ్చారు.  ప్యాలెస్ రోడ్‌లో సంజీవని వైద్యశాల, మొబైల్ క్లినిక్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న సొంత ఇంటిని భువనేశ్వరి పరిశీలించారు.

లోకేశ్‌ పాదయాత్ర నిర్వహించాలని భావించినప్పుడు ముందు ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. పాదయాత్రలో లోకేశ్‌ రాటు తేలిపోయారని, ఇక ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజల కోసం లోకేశ్ పాదయాత్ర పూర్తి చేసి తీరతారని,  పాదయాత్రలోనే కాదు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబంపై ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి భువనేశ్వరి సైతం రాజకీయంగా కుప్పంలో తన భర్త చంద్రబాబుని గెలిపించడానికి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news