ఢిల్లీలో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పలుకుబడి పడిపోయిందా..? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆయనను దూరం పెట్టిందా..? అంటే తాజా పరిణామాలు మాత్రం ఔననే చెబుతున్నాయి. ఇందుకు మూడు నాలుగు కారణాలు కనిపిస్తున్నాయనిన చెప్పొచ్చు. గతంలో ఢిల్లీలో విజయసాయిరెడ్డి హడావుడి మామూలుగా ఉండేది కాదు. ఎప్పుడంటూ అప్పుడే ప్రధాని మోడీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి ప్రత్యక్షమయ్యేవారు. ఒకానొక దశలో ప్రధాని మోడీ కూడా విజయసాయిరెడ్డిపి పలకరించి మరీ కరచాలనం ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అమ్మో.. ఢిల్లీలో బాగానే పలుకుబడి ఉందని అనుకున్నారు. నిజానికి.. అప్పుడు ఆయన హవా అలా నడిచింది మరి.
2019 ఎన్నికల తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ ప్రధాన టార్గెట్ వైసీపీ అయిపోయింది. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి కూడా చాలా తెలివిగా.. చాలా నిర్ణయాలను కేంద్రానికి చెప్పే తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇది ఏపీ బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిని ఎంతదూరంగా ఉంచితే అంతమంచిదనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక అప్పటి నుంచే విజయసాయిరెడ్డి హడావుడికి చెక్‌పడినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించేందుకు ఏపీ ప్రభుత్వం బాగానే ప్రయత్నం చేసింది. ఎందుకంటే.. జగన్‌కు స్టీఫెన్‌తో మంచి రిలేషన్ ఉందన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను ఏపీకి తీసుకెళ్లేందుకు విజయసాయిరెడ్డి బాగా ప్రయత్నం చేశారు. కానీ.. అందుకు కేంద్రం నో చెప్పడంతో విజయసాయిరెడ్డికి చెక్ పడిందనే టాక్ మొదలైంది.
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాల నేపథ్యంలో బీజేపీ, వైసీపీల మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది. ఏపీలో బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక ఢిల్లీలో విజయసాయిరెడ్డి పలుకుబడి పడిపోయినట్టేననే టాక్ వినిపిస్తోంది. అంతేగాకుండా.. ప్రధాని కార్యాలయం అపాయింట్‌మెంట్ కూడా విజయసాయిరెడ్డికి దొరకడం లేదని తెలుస్తోంది.