టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతు కోరిన బీజేపీ ఎంపీ అర్వింద్

-

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతు కోరారు. తను చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధవనగర్ రైల్వే లైన్ వద్ద రాకపోకలు అత్యధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రైలు వచ్చే సమయంలో వాహనాలు కిలోమీటర్ల వరకు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ మాధవనగర్ రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)కి గతంలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరిగా స్పందించకపోవడంతో మాధవనగర్ ఆర్వోబీ పనులు ముందుకు కదలడం లేదు. దీంతో గత ఎనిమిది నెలలుగా మాధవనగర్ ఆర్వోబీ పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. పెండింగ్ పనులకు సంబంధించి జిల్లాకు చెందిన, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీరుకు నిరసనగా స్థానిక ఎంపీ అర్వింద్ సోమవారం రోజున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

సోమవారం ఉదయం 10-30 నిమిషాలకు మాధవనగర్ రైల్వేగేట్ నిరసన చేపట్టనున్నట్లు ఎంపీ అర్వింద్ ప్రకటించారు. ఇక నిరసన కార్యక్రమానికి ఎంపీ అర్వింద్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డిల మద్దతు కోరారు. ప్రజల శ్రేయస్సు కోసం పార్టీలకతీతంగా ఈ నిరసన కార్యక్రమంలో  పాల్గొని మద్దతు ప్రకటించాలని ఆహ్వానించారు. పార్టీలు వేరైనా, ప్రజల కోసం చేస్తున్న ఈ నిరసనకు మద్దతు ఇవ్వాలని ఓ ప్రకటనలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version