బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్… గులాబీ పార్టీలో వింత పరిస్థితి

-

బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు చేయాలా….అంటే అవుననే అంటున్నారు గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్ర సమితి ని భారత రాష్ట్ర సమితి గా పేరు మార్చడంపై కార్యకర్తల నుంచి ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.పలువురు సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేరు మార్చడంతో స్థానిక వాదం బలహీనపడిందని.. ఈ కారణంతో నే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైందని బీఆర్ఎస్ లోని ఓ వర్గం బలంగా వాదిస్తోంది.మళ్లీ పేరు మారిస్తే తప్ప తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం రాదని,ముఖ్యంగా ఓటర్లు బీఆర్ఎస్ ను నమ్మడం లేదని గట్టిగా చెబుతున్నారు. మరి కార్యకర్తల అభిప్రాయాలను, సీనియర్ల సూచనల మేరకు గులాబీ బాస్ ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచాయి.పదేళ్ల అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో తనదైన మార్క్ వేసుకుంది గులాబీ పార్టీ.ఉద్యమ పార్టీగా ప్రజలకు చేరువై రాష్ట్రాన్ని సాధించి ప్రజల మన్ననలు పొందింది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అయితే జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాలన్న అభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని వెల్లడించగా కార్యవర్గం సంపూర్ణ మద్దతు తెలపడంతో పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా మారింది.ఈ పేరుతో కేసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి పార్టీని విస్తరించే కార్యాచరణను అమలు చేశారు. మహారాష్ట్ర, ఢిల్లీలో పార్టీ కార్యాలయాలను మొదలుపెట్టారు.

అప్పట్లోనే పేరు మార్పుపై క్యాడర్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి.పార్టీ పేరు మార్చడంతో తెలంగాణ ప్రజలకు పార్టీ దూరమైందన్న వాదనను కొంతమంది ఉద్యమకారులు తెరపైకి తెచ్చారు. ఈ ప్రభావం ఎన్నికలలో ప్రత్యక్షంగా ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.అయితే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న కేసిఆర్ పార్టీ నేతల అభ్యంతరాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాదాపు రెండేళ్ల పాటు వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అధినేతగా కెసిఆర్ పార్టీ కార్యక్రమాలను విస్తరించే ప్రయత్నం చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి ప్రతికూల ఫలితాలు వచ్చాయి.40 సీట్లు కూడా గెలవలేని పరిస్థితికి వచ్చేసింది గులాబీ పార్టీ. దీంతో పోస్టుమార్టం మొదలుపెట్టిన బీఆర్ఎస్ అగ్రనేతలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్లీ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ సీనియర్‌ నేత కడియం శ్రీహరి తన అభిప్రాయాన్ని ఓ సమీక్ష సమావేశంలో వ్యక్తపరిచారు. పార్టీలోని కేడర్ సైతం ఈ అభిప్రాయానికి బలం చేకూర్చారు. తెలంగాణ ప్రజలతో మమేకం కావాలంటే పేరు మార్చాల్సిందేనని బలంగా పట్టు పడుతున్నారు. పేరు మార్చాలని ఎక్కువ మందు కోరడంతో పార్టీ కూడా ఇప్పుడు పునరాలోచనలో పడిండి.ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలే కేడర్ కి చెప్పుకొస్తున్నారు. పార్టీ పేరును మార్చాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వస్తే పార్టీ అధినేత కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తి కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్న గులాబీ బాస్ త్వరలోనే యాక్టివ్ మోడ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కార్యకర్తల అభిప్రాయాలకు ఆయన ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news