అది జగన్ వల్ల కాదంటున్న ఏబీఎన్ రాధాకృష్ణ..?

-

ఏపీ సీఎం జగన్ ఏపీ హైకోర్టును కర్నూలుకు మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్టు కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి కూడా క్లారిటీ రావడం లేదు. అయితే హైకోర్టు మార్పు అంత సులభం కాదంటున్నారు ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ. తన తాజా కొత్త పలుకు వ్యాసంలో ఆయన దీనిపై విశ్లేషణ చేశారు.

ఆయన ఏమంటున్నారంటే.. “ ఎన్నికల ముందువరకు హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై వివాదమే ఉండేది కాదు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ నిర్ణయం కూడా వివాదాస్పదం అయ్యింది. నిజానికి అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించిన తర్వాత హైకోర్టును అక్కడి నుంచి తరలించడం సాధ్యం కాదు.

ఎందుకంటే.. రాష్ట్ర విభజన తర్వాత ప్రిన్సిపల్‌ సీట్‌ ఆఫ్‌ హైకోర్టును రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాలని భారత రాష్ట్రపతి స్వయంగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరగాలంటే మళ్లీ రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేయాలి. లేదా ప్రస్తుత హైకోర్టులోని జడ్జిలలో మెజారిటీ సభ్యులు హైకోర్టు మార్పునకు అంగీకరించాలి.

వీటన్నింటికి తోడు బార్‌ కౌన్సిల్‌లో మెజారిటీ సభ్యులు సీమయేతర జిల్లాలకు చెందినవారున్నారు. మెజారిటీ సభ్యుల అంగీకారం లేకుండా చేయగలిగింది ఏమీ లేదు. ఈ నిబంధనలన్నీ తెలుసో లేదో తెలియదు గానీ జగన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం తేనెతుట్టెను కదుపుతోంది. “

ఇదీ ఆంధ్రజ్యోతి పత్రిక విశ్లేషణ. ఈ ప్రకారం చూస్తే హైకోర్టు మార్పు అంత సులభంగా అయ్యేట్టు కనిపించడం లేదు.మరోవైపు సీమ జిల్లాల్లో ఈ విషయంపై రోజురోజుకూ ఆందోళనలు పెరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news