తెలుగుదేశం పార్టీలో కొందరు అభ్యర్థులను చంద్రబాబు మార్చేశారు. ఈ మేరకు కొత్తవారికి బీ ఫారాలు అందించారు చంద్రబాబు నాయుడు.
బీ ఫారాలు అందుకున్న తరువాత వారితో మాట్లాడారు. ప్రధానంగా ఐదు నియోకవర్గాల్లో ఈ మార్పులు చేశారు.
గతానికి భిన్నంగా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. అయితే మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను మూడు విడతల్లో ప్రకటించారు. ఇక నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత… ఇప్పుడు అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చేందుకు పార్టీ కార్యాలయం నుంచి పిలుపు అందింది. అయితే వీటిలో ఐదు స్థానాల్లో మాత్రం చంద్రబాబు మార్పులు చేశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ఎంపీగా పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది.
దీంతో రఘురామను అసెంబ్లీకి పంపాలని బాబు నిర్ణయించారు. అది కూడా నరసాపురం పార్లమెంట్ పరిధిలోనే టికెట్ ఇవ్వాల్సి రావడంతో… ఉండి నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంపిక చేశారు. ఉండి టికెట్ విషయంలో ఇప్పటికే టీడీపీలో కొంత ఇబ్బంది ఉంది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు మధ్య పోటీ ఉంది. అయితే వీరిలో రామరాజు పేరును చంద్రబాబు ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుటు ఆర్ఆర్ఆర్ రాకతో ఉండి బరి నుంచి రామరాజును తప్పించి… ఆయనకు నరసాపురం పార్లమెంట్ అధ్యక్షునిగా ఎంపిక చేశారు. దీంతో ఉండిలో ఆర్ఆర్ఆర్‌కు లైన్ క్లియర్ అయ్యింది.
ఇక పాడేరు నుంచి కె.వెంకట రమేష్ నాయుడు పేరును ముందుగా ప్రకటించారు. అయితే అక్కడ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్న గిడ్డి ఈశ్వరి వర్గం తీవ్ర మనస్తాపానికి గురి కావడంతో బీ ఫారం ఆమెకే ఇచ్చారు. 2014లో వైసీపీ తరఫున గెలిచిన గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఫస్ట్ లిస్ట్ పేరు లేకపోయినప్పటికీ… చివరికి బీ ఫారం దక్కించుకున్నారు గిడ్డి ఈశ్వరి.
మడకశిర అభ్యర్థి సునీల్ కుమార్‌ను కూడా చంద్రబాబు మార్చేశారు. ఫస్ట్ లిస్ట్‌లోనే సునీల్ పేరు ఉన్నప్పటికీ.. ప్రచారంలో ఆయన వెనుకబడినట్లు సర్వే రిపోర్టు రావడంతో.. ఆయనను తప్పించారు చంద్రబాబు. ఆయన స్థానంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు బీఫారం అందించారు. మాడుగుల నుంచి ముందుగా పైలా ప్రసాదరావును టీడీపీ ప్రకటించింది.
అయితే ఇక్కడ కూడా అభ్యర్థిని మార్చేశారు. పైలా స్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బీ ఫారం ఇచ్చారు చంద్రబాబు. పెందుర్తి టికెట్ కావాల్సిందే అంటూ పట్టుబట్టిన బండారును ఒప్పించిన చంద్రబాబు… చివరికి మాడుగుల పంపారు. వెంకటగిరి టికెట్‌ను ముందుగా కురుగొండ్ల లక్ష్మీప్రియ పేరును ప్రకటించిన టీడీపీ… తాజాగా ఆమె స్థానంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేరునే ఖరారు చేశారు.
అయితే దెందులూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు కాస్త ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులకు బీ ఫారం ఇవ్వలేదు. దెందులూరు నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరును ఇప్పటికే ప్రకటించారు. అయితే అనపర్తితో ఆ స్థానం ముడి పెట్టారు బీజేపీ నేతలు. అనపర్తి కావాలంటే దెందులూరు ఇవ్వాలని లింక్ పెట్టారు. దీంతో చింతమనేనికి బీ ఫారం ఇవ్వలేదు. అలాగే తంబళ్లపల్లి నుంచి జయచంద్రారెడ్డి పేరును ప్రకటించారు. అయితే సర్వేలు ఆయనకు వ్యతిరేకంగా రావడంతో మార్చేందుకు హైకమాండ్ ఆలోచిస్తోంది. అక్కడ నుంచి సరళా రెడ్డి, శంకర్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరిలో ఒకరికి ఖాయమంటున్నారు పార్టీ నేతలు.