మూడు రాజధానుల ప్రకటన, అనంతరం చర్చలతో సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. మూడు రాజధానుల ప్రకటన నుంచి ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూనే దీనికి సంబంధించిన అనేక ప్రతిపాదనలతో జగన్ ప్రభుత్వం రూపొందించిన రాజధానుల బిల్లు సోమవారం చర్చకు వచ్చింది. ఈ బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సహా అనంతరం పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు దీనిపై చర్చించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వారు స్వాగతించారు. అదేసమయంలో గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అమరావతి పేరుతో సాగిన దందాలు వంటివాటిని అసెంబ్లీ వేదికగా ఏకరువు పెట్టారు.
అదే సమయంలో రాజధానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయకుండానే టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన హడావుడిపై వైసీపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు చేసిన హడావుడి, తర్వాత ఆయన డిమాండ్లు, సవాళ్లు వంటివి కూడా మంత్రులు అసెంబ్లీలో చర్చకు పెట్టారు. ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూనే.. అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేసి రాజధానిపై రిఫరెండం కోరాలని సవాల్ చేస్తున్న విషయాన్ని ప్రస్థావించారు.
అయితే, ఏడు మాసాల కిందట జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు రిఫరెండం ఇచ్చారని అంటూనే ఏదైనా రిఫరెండం కావాలని అంటే.. తనకున్న 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే.. అప్పుడు తెలుస్తుందని, ప్రజలు అప్పుడు చెబుతారని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సంఘటనను ఉటంకించారు. అప్పట్లో ప్రజల్లో తెలంగాణ ఉద్యమ సెగలేదని కాంగ్రెస్ నాయకుడు ఎంఎస్ ఆర్ అంటే.. వెంటనే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారని, అప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చారని… అదేవిధంగా ఇప్పుడు అమరావతే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చంద్రబాబు చెబుతున్నారని, అదే నిజమైతే.. చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవాలని.. అప్పుడు తాము ఒప్పుకొంటామని, అంతే తప్ప తమను రాజీనామా చేయాలని పిచ్చి పిచ్చి కూతలు కూయడం మానుకోవా లని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
దీనికి ముందు మాట్లాడిన వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఇదే విషయంపై మాట్లాడారు. చంద్రబాబు అమరావతికి రిఫరెండం కోరుతున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు రిఫరెండం ఇచ్చారని అన్నారు. రాజ.ధాని గ్రామాలున్న నియోజకవర్గాలైన మంగళగిరి, తాడికొండల్లో టీడీపీని చిత్తు చిత్తు ఓడించి, వైసీపీని గెలిపించారని, అయినా చంద్రబాబు బ్రెయిన్ పనిచేయడం లేదని, అందుకే రిఫరెండం కోరుతున్నారని, సో.. ఇప్పుడు ఆయన తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే.. అప్పుడు తెలుస్తుందని కన్నబాబు వ్యాఖ్యానించారు. అదేవిధంగా మంత్రి బొత్ససత్యనారాయణ కూడా దాదాపు ఇవే వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు అధికార పక్షానికి విసిరిన రాజీనామా, రెఫరెండం సవాళ్లు ఆయన మెడకే చుట్టుకున్నట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.