ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. తెలంగాణాలో పూర్వ వైభవానికి ప్లాన్ చేస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.. వారంలో రెండు రోజులు హైదరాబాద్ లో మకాం వేసి.. పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు.. గతంలో పార్టీలో ఉన్న నేతల్ని ఆహ్వానించేందుకు సిద్దమవుతున్నారు.. పలువురు మాజీలు నేరుగా చంద్రబాబునే కలుస్తున్నారు..దీంతో సైకిల్ ఎక్కేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది..
రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.. ఏపీలో అధికారంలో ఉండటంతో.. ఈ కార్యక్రమం ఒక యజ్ణంలా జరుగుతోంది.. తెలంగాణాలో కూడా అదే స్థాయిలో నిర్వహించేలా చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యనేతలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు కూడా.. తీగల కృష్ణారెడ్డితో పాటు.. పలువురు చంద్రబాబుకు టచ్ లో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది..
తెలంగాణాలో పార్టీ బలోపేతం పై చంద్రబాబునాయుడు దృష్టి పెట్టారు.. దీంతో తెలంగాణ లోని పలువురు నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు చంద్రబాబును కలిశారు. ఒకప్పుడు టీడీపీ నుంచే ప్రస్థానం ప్రారంభించిన వారు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలంగాణీఆలో టాక్ వినిపిస్తోంది.. సీనియర్లను, బలమైన నేతలను తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.. ఇదే సమయంలో తెలంగాణాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా పార్టీ మీద ఆసక్తి ఉండే నేతల్ని సభ్యత్వాలు తీసుకోమని చంద్రబాబు సూచించారట.. దీంతో బాబూ మోహన్ ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
అందోల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాని బాబూ మోహన్ తీసుకున్నారు.. బాబుమోహన్ 1998లో అందోల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 1999 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆ తరువాత కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004,2014 ఎన్నికల్లో గెలుపొందారు. 2018లో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో బాబుమోహన్ బీజేపీలో చేరారు. ఇలా పలు పార్టీలు మారినా.. ఎక్కడా ఆయనకు ప్రాధాన్యత దక్కలేదు.. దీంతో తిరిగి స్వంత గూటికి వెళ్లేందుకు బాబూ మోహన్ సిద్దమయ్యారు.. అందులో భాగంగానే టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కూడా సభ్యత్వాలు తీసుకునే అవకాశముందని తెలంగాణ టీడీపీ నేతలు చర్చించకుంటున్నారు.