దగ్గుబాటి వారసుడుకు బాబు లైన్ క్లియర్ చేస్తున్నారా?

-

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. పరిస్తితులు బట్టి నిర్ణయాలు మారిపోతాయి…నేతలు మారిపోతారు. ఇటీవల ఏపీలో ఊహించని విధంగా నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఒకే వేదికపై కలిసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అల్లుళ్ళైన ఈ ఇద్దరు…1996 తర్వాత మళ్ళీ పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. నందమూరి ఫ్యామిలీలో జరిగిన ఓ ఫంక్షన్‌లో ఈ ఇద్దరు నేతలు కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పక్కపక్కనే నిలబడ్డారు. ఆపైన ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ఈ దృశ్యాలను చూసి టీడీపీ క్యాడర్ సంతోషించింది.
chandrababu naidu
అయితే ఎప్పుడు కలవని నేతలు… కలవడంతో ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైపోయింది. ఇక దగ్గుబాటి, బాబుతో కలిసిపోతారని, టీడీపీలో పనిచేస్తారని, అలాగే ఆయన తనయుడుని టీడీపీలో చేరుస్తారని ప్రచారం మొదలైంది. కాకపోతే ప్రస్తుతానికి దగ్గుబాటి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పురంధేశ్వరి మాత్రమే బీజేపీలో పనిచేస్తున్నారు. దగ్గుబాటి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి రాజకీయాల్లో లేరు. కానీ గత ఎన్నికల ముందు దగ్గుబాటి..తన తనయుడు హితేష్‌ని వైసీపీలో చేర్చారు. అలాగే పర్చూరు టిక్కెట్ కూడా తీసుకున్నారు.
కానీ హితేష్ విదేశీ పౌరసత్వం ముగియకపోవడంతో తనకు పోటీ చేయడానికి అవకాశం కుదరలేదు. దీంతో దగ్గుబాటి స్వయంగా వైసీపీ నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగారు. పైగా జగన్..పర్చూరు బాధ్యతలు రావి రామనాథం బాబుకు అప్పగించారు.
దీంతో దగ్గుబాటి మళ్ళీ పార్టీలో కనిపించలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబుతో కనిపించడంతో ఆయన టీడీపీ వైపుకు వస్తారని ప్రచారం నడుస్తోంది. అలాగే తన తనయుడు హితేష్‌ని టీడీపీలో చేరుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక చీరాల టిక్కెట్ కూడా ఇస్తారని కథనాలు వచ్చేస్తున్నాయి. చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎలాగో వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో చీరాలలో టీడీపీ బాధ్యతలు హితేష్‌కు అప్పజెప్పుతారని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి బాబు రాజకీయాలు ఎలా ఉంటాయో.

Read more RELATED
Recommended to you

Latest news