టార్గెట్ బొత్స.. చంద్రబాబు ప్రయత్నం ఫలించేనా..!

-

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ఎంత బలమైన నేత అనేది అందరికీ తెలిసిందే. రెండు దశాబ్దాల నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్నారు బొత్స. సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద కీలక నేతగా ఉన్న బొత్సను టార్గెట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. బొత్స ఓటమే లక్ష్యంగా చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సత్యనారాయణపై బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని చూస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లికి అభ్యర్థి ఎంపిక చంద్రబాబు కి సమస్యగా మారింది. గంటా శ్రీనివాసరావు,కిమిడి కళావెంకట్రావు పేర్లను చంద్రబాబు ప్రస్తావించినా చీపురుపల్లి నుంచి వరకు అంతగా ఆసక్తి చూపడం లేదు.

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చీపురుపల్లి నియోజకవర్గం కంచుకోటగా ఉంది. అయితే బొత్స రాకతో క్రమంగా ఇది ఆయన వశమైంది.ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత నార్త్ లో ముగ్గురు నాయకులకు పెత్తనం ఇచ్చారు. విశాఖపట్నం నుంచి ఎంవీవీఎస్ మూర్తి, విజయ నగరం నుంచి గద్దె బాబూరావు, శ్రీకాకుళం నుంచి ఎంవీ కృష్ణారావు గెలుపొందుతూ వచ్చారు. విజయనగరంలో గద్దె బాబూరావు హవాకు అడ్డుకట్ట వేసి చీపురుపల్లిని కాంగ్రెస్ ఖాతాలో వేసింది బొత్స సత్యనారాయణే.బొత్స మొదటిసారి చీపురుపల్లిలో 2004లో పోటీ చేసి గెలిచారు.కాపులకు పెద్దదిక్కుగా ఉన్న పెదబాబు కుటుంబం కూడా వైసీపీతో ఉండటం వల్ల బొత్సను ఇక్కడ ఢీకొట్టడం అంత సులువు కాదని టీడీపీ భావిస్తోంది.

చీపురుపల్లిలో అభ్యర్థుల గెలుపు బాధ్యతను తీసుకున్న బెల్లాన చంద్రశేఖర్ కుటుంబం ఒకవైపు, ఇటు రాజాం నుంచి వైసీపీ బాధ్యతలు చూస్తున్న చిన్నశ్రీను ఎత్తుగడలు మరోవైపు ఉండటం వల్ల చీపురుపల్లిని టీడీపీ అంత సులువుగా గెలవలేదని భావిస్తున్నారు.వాస్తవానికి చీపురుపల్లి నుంచి పోటీ చేయమని టీడీపీ కోరిన గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావు సాధారణమైన నాయకులు కారు. గంటా శ్రీనివాసరావు ప్రకాశం జిల్లాకు చెందిన కాపు నేత.

ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా తన సొంత బృందంతో సర్వే చేయించుకుని సానుకూల ఫలితాలు వస్తేనే ముందడుగు వేస్తారు. అదే రీతిలో చీపురుపల్లిలోనూ సర్వే చేయించి ఉంటారని, అందులో వ్యతిరేక ఫలితం రావడం వల్లే పోటీకి ఆసక్తి చూపడం లేదని నేతలు చెబుతున్నారు. ఇక కళా వెంకట్రావు కూడా ఉణుకూరు, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి గెలుపొందిన చరిత్ర ఉంది. శ్రీకాకుళం జిల్లాలో శాసనసభ్యుడైనా, ఆయన రాజకీయ క్షేత్రం మాత్రం విజయనగరం జిల్లానే. కానీ బొత్స మీద పోటీ అనేసరికి టీడీపీ నుంచి ఎవరూ ముందుకురాకపోవడంతో చంద్రబాబుకి దిక్కు తోచడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version