2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేనివిధంగా ఘోరంగా పరాజయం పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే.. ఆ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే దక్కాయి. 25 ఎంపీ సీట్లలో కేవలం మూడంటే మూడు చోట్ల మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఇక అసెంబ్లీ సీట్ల విషయాలకు వస్తే కొన్నిజిల్లాలకు జిల్లాల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.
గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ తప్ప వేరే నాయకుడు ఒక్కరు కూడా గెలవలేదు. అయితే.. ఇంత ఘోర పరాజయాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే ఆ ఫలితాలపై ఓ అంచనాకు వస్తున్నారు. క్రైసిస్ లోనే అవకాశాలు వెదుక్కోవాలన్నది చంద్రబాబు ఫిలాసఫీ. అందుకే.. పార్టీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలకు ఎక్కువ, పార్టీకి తక్కువ సమయం కేటాయించడం వల్లే ఓడిపోయామని చంద్రబాబు అభిప్రాయానికి వచ్చారు. అదే పార్టీకి మరికొంత సమయం వెచ్చించి ఉంటే మొన్నటి ఎన్నికల్లో ఓటమి ఎదురై ఉండేది కాదేమోనని ఆయన అంటున్నారు.
అంతేకాదు.. మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోస్తున్నారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సీబీఎన్ ఆర్మీ సభ్యులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ చేసిన అసత్య ప్రచారాలతో ప్రజల్లో అపోహలు పెరిగాయన్నారు.
ఇక నుంచి పార్టీలో సమర్థులను గుర్తించి అనుబంధ విభాగాల్లో స్థానం కల్పిస్తామన్న చంద్రబాబు.. అన్ని స్థాయిల్లో పార్టీ వ్యవస్థను పటిష్టం చేసి ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మరోసారి తాను ఏపీకి సీఎం అవుతానని.. రాష్ట్రాన్ని చక్కదిద్దే అవకాశం తనకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.