చంద్రబాబు రాజకీయ చతురతను అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ స్నేహాలు కన్నా మిన్నగా స్వచ్ఛమైన స్నేహాలు ప్రభావితం చేస్తున్నాయి. స్వచ్ఛమైన స్నేహం చంద్రబాబు కానీ జగన్ కానీ ఎవ్వరితోనయినా చేయగలిగితే మంచి ఫలితాలే వస్తాయి.అవసరాలకు అనుగుణంగా చేస్తున్న స్నేహాల కారణంగానే పెద్ద పెద్ద పార్టీలుసైతం బోల్తా పడుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఒకనాటిలా బీజేపీతో వెళ్లేందుకు, పవన్ తో నడిచేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ మాత్రం అస్సలు ససేమీరా అంటున్నారు. పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేస్తామని అంటున్నారు. పొత్తులపై క్లారిటీ ఇవ్వడం లేదు. అదేవిధంగా సొంతంగా పోటీచేసి ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకోవాలన్న తపన కూడా పవన్ లో ఉంది. ఏదో ఒక పార్టీతో ఇప్పటిదాకా రెండు ఎన్నికల్లో ప్రయాణించి పవన్ చాలాఇబ్బందులు పడ్డారు. అవేవీ వద్దనుకుని పవన్ ఈ సారి అటు బీజేపీతోనూ,ఇటు టీడీపీతోనూ రాజకీయం నడిపేందుకు ఇష్టపడడం లేదు.
కాపు సామాజికవర్గంకు చెందిన వారంతా ఇప్పటిదాకా అయితే టీడీపీ వైపు, లేదా వైసీపీవైపు ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో పవన్ వైపు వాళ్లుంటే ఇక రెండు పార్టీలకూ కష్టకాలమే! ఈ దశలో కాపు సామాజికవర్గ నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా జగన్ కానీ చంద్రబాబు కానీ ప్రయత్నిస్తున్నారు. మంత్రులు కొందరు కాపు సామాజికవర్గం కు చెందిన వారు అయినప్పటికీ వారి ప్రభావం పెద్దగా లేదు.దీంతో అటు ముద్రగడతో రాజకీయం చేయాలని జగన్ భావిస్తున్నారు. ఆయనతో సొంతంగా ఓ పార్టీ పెట్టించాలని యోచిస్తున్నారు. ఇంకోవైపు కాపు సామాజికవర్గానికి మరిన్ని తాయిలాలు ఇచ్చేందుకు యోచిస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఏర్పాట్లు ఈ విధంగా ఉంటే కాపులు మాత్రం తమ వాదన వేరుగా వినిపిస్తున్నారు. రాజ్యాధికారం సాధన దిశగా తాము అడుగులు వేస్తామని అంటున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కాపు సామాజిక వర్గ నేతే సీఎం కావాలన్నది తమ అభిమతం అంటున్నారు. కానీ ఇందుకు అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ ఒప్పుకోరు. అయితే కుర్చీ బాబుది లేదంటే జగన్ ది కావాలి కానీ కాపులకు చెందకుండా ఉండేందుకే ఎక్కువ ప్రయత్నాలు వారిద్దరూ చేయవచ్చు అన్నది పరిశీలకుల మాట.