టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఐటీ కంపెనీల పేరుతో చంద్రబాబు భూకుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ భూ కేటాయింపుల్లో కనిపించిన కంపెనీలు రాష్ట్రానికి వచ్చిన దాఖలాలే లేవని చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన కంపెనీలన్నీ లోకేష్ బినామీలేనని విమర్శించారు. 24 గంటల్లో కంపెనీలకు కేటాయించిన భూముల వివరాలు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో వారి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు లూటీ చేశారని ధ్వజమెత్తారు.సీఎం రమేష్ కంపెనీపై జరిగిన దాడుల్లో వందల కోట్ల రూపాయలకు లెక్కలు లేవన్న విషయం తేలిందని, ఇప్పుడు మీసం తీయించుకుంటారా అని ప్రశ్నించారు.
నారా లోకేష్ అర్హతలపై పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధితుల దగ్గరకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. సహాయక చర్యలు తక్కువ.. ప్రచారం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టు ఇవ్వాల్సి ఉందని జీవీఎల్ తెలిపారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై విమర్శలు
ఈ సందర్భంగా ఏబీఎన్ ఛానెల్ ఎండి వేమూరి రాధాకృష్ణ తీరుపై జీవీఎల్ మరోసారి మండిపడ్డారు. ఇటీవల ఛానల్లో డిబేట్‌కు పిలిచి సీఎం రమేష్ తరఫున రాధాకృష్ణ వకాల్తా పుచ్చుకున్నారన్నారు. సీఎం రమేష్ బూతులు మాట్లాడితే రాధాకృష్ణకు స్పందన లేదని, ఇదేమి జర్నలిజమని ప్రశ్నించారు. రాధాకృష్ణ టిడిపి ఏజెంటులా మాట్లాడారన్నారు.